Nov 23,2022 22:59

ప్రజాశక్తి-జగ్గయ్యపేట 

మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు అతి దగ్గరలో గల గ్రీన్‌ టెక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ నుండి వచ్చే దుర్వాసనకు విద్యార్థులు వాంతులు, తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టిడిపి జాతీయ కోశాధికారి, మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌ బుధవారం షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పాఠశాలలో విద్యార్థులను పరామర్శించి అనంతరం పాఠశాలకు దగ్గరలో ఉన్న కెమికల్‌ ప్లాంట్‌ ను పరిశీలించారు. బోర్‌ లోని వాటర్‌ వాసన వస్తోందని, రాత్రిపూట నిద్రపోవడానికి కూడా ఈ వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు రాజగోపాల్‌ కు వివరించారు. దీనిపై గ్రామస్తులు స్థానిక తహసిల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే క్లోజ్‌ చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ఆ సమస్యను పరిష్కరించ లేదని తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ ప్రజలు నివసించే ప్రాంతానికి దగ్గరలో గ్రీన్‌ టెక్‌ ఇండిస్టీ ను ఏర్పాటు చేసి యాజమాన్యం వారి ఇష్ట రాజ్యంగా పొల్యూషన్‌ విపరీతంగా వదులుతోందన్నారు. దీనివలన గ్రామంలోని ప్రజలు, దగ్గరలో ఉన్న పాఠశాల విద్యార్థులు, వ్యవసాయ రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే గ్రీన్‌ టెక్‌ ఇండిస్టీని మూసెంతవరకు గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామ ప్రజలు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.