ప్రజాశక్తి- కె.కోటపాడు
కె.కోటపాడు కేంద్రంగా కొత్తగా పోలీసు సర్కిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తరువాత పోలీసు సేవలు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కొత్త పోలీసు సబ్ డివిజన్లు, సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కె.కోటపాడు పోలీస్ సర్కిల్ ఏర్పాటుకు ఈ ఏడాది జూన్‌లో జిల్లా ఎస్‌పి గౌతమి శాలి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా దానికి ఆమోదం తెలుపుతూ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కె.కోటపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో వి.మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు, ఎ.కోడూరు పోలీస్ స్టేషన్లను చేర్చారు. ఈ ఐదు స్టేషన్లు ఇప్పటివరకు చోడవరం పోలీసు సర్కిల్ పరిధిలో ఉండేవి. కె.కోటపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా తాతారావును ఉన్నతాధికారులు నియమించారు. కె.కోటపాడులో పోలీస్ స్టేషన్ నూతన భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. నూతన భవనంలోని పైభాగాన్ని సర్కిల్ కార్యాలయానికి ఉపయోగించనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.










