Dec 29,2022 00:16

ఐఎస్‌ఒ ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంటున్న కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రధాయినిగా గుర్తింపు పొందిన కెజిహెచ్‌కు ఐఎస్‌ఒ ధ్రువీకరణ పత్రం లభించింది. ఈ ధ్రువపత్రాన్ని కెజిహెచ్‌ డాక్టర్‌ మైథిలికి గురువారం హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికెషన్‌ ప్రయివేటు లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివయ్య, ఎఎంసి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు అందజేశారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి ప్రత్యేకంగా హైజిన్‌ ప్రాక్టీస్‌ ఐఎస్‌ఒ ధ్రువీకరణ పత్రాన్ని ఆ విభాగం హెచ్‌ఒడి డాక్టర్‌ సుందర్‌ రాజుకు అందజేశారు. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు ఇటీవల ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కెజిహెచ్‌లో అన్ని విభాగాలను సందర్శించి ఆడిట్‌ నిర్వహించారు. ఈ సంస్థ క్వాలిటీ ఎసూరెన్స్‌, క్వాలిటీ మేనేజ్మెంట్‌ అంశాలపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించింది. ఆయా విభాగాలు రికార్డుల నిర్వహణ, సైన్‌ బోర్డ్స్‌, వార్డులలో వైద్య సిబ్బంది జవాబుదారీతనం, ఐసియులో డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, చికిత్సకు సంబంధించి అనుసరిస్తున్న వివిధ అంశాలను తనిఖీచేశారు. వీటన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని 9001-2015 ఐఎస్‌ఒ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కెజిహెచ్‌ ఎడి చిట్టూరి శ్రీనివాసకుమార్‌, సిఎస్‌ ఆర్‌ఎమ్‌ఒ డాక్టర్‌ వాసుదేవ్‌ పాల్గొన్నారు.