ప్రజాశక్తి-కలెక్టరేట్ : కెజిహెచ్ ప్రాంగణంలోని వార్డు బార్సు కాలనీలో వందేళ్ళగా నివసిస్తున్న 270 నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయించి వెళ్లిపోవాలని, లేకుంటే కాలనీ ఇళ్లను కూల్చివేస్తామని కెజిహెచ్ సూపరింటెండెంట్ నోటీసులు ఇవ్వడం సరికాదని రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కాలనీ ప్రజలతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ పరిధిలో గల కెజిహెచ్ వార్డుబారు లైన్‌లో తాతల కాలం నుంచి నివాసముంటున్న దళిత రెల్లి కులస్తులు 270 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేయాలని, లేకుంటే ఆగస్టు 3న బుల్ డోజర్లతో ఖాళీ చేయిస్తామని నోటీసులు జారీచేసారని తెలిపారు. 100 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసమున్న దళిత రెల్లి కులస్తులను ఖాళీ చేయిస్తే, బాధిత కుటుంబాలు ఎక్కడ బ్రతకాలని ప్రశ్నించారు. వీరందరూ కెజిహెచ్‌లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ పూటగడవని స్థితిలో ఉన్నారని, ఇదే స్థలంలో జి ప్లస్ 2 పద్ధతిలో స్కీమ్ ఇళ్లుకట్టించి ఇవ్వాలని డిమాండ్‌చేశారు. లేని పక్షంలో 270 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.










