Aug 31,2023 00:15

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎపి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాజ్‌కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి- చింతూరు
మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, ఎంపిటిసి వేక రాజ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కెజిబివిని గిరిజన సంఘం నాయకులు సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 21 మంది విద్యార్థులు ప్రవేశం పొందామని, అధ్యాపకులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని విద్యార్థులు తెలిపారు. ఒక్క ఎకనామిక్స్‌కు తప్పా మిగిలిన సబ్జెక్టులకు లెక్చరర్లు లేరని పేర్కొన్నారు. టెస్ట్‌ బుక్స్‌ ఇప్పటివరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌ మాత్రమే ఇచ్చారని, మిగిలిన పుస్తకాలు ఇవ్వలేదని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఐటిడిఎ కార్యాలయం పక్కనే ఉన్న కెజిబివి పట్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. పిల్లలు బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిపోయి లెక్చరర్స్‌ను నియమించకపోవడం, పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అధ్యాపకులు లేకుండా పిల్లల చదువు ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. తక్షణమే అధ్యాపకులను నియమించాలని, పూర్తి స్థాయిలో పాఠ్యపస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌, పొడియం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.