Sep 21,2023 19:23

డిఇఒ కార్యాలయం

ప్రజాశక్తి-ఆలూరు
కర్నూలు సమగ్ర శిక్షలోని కెజిబివి పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత మే నెల 27న నోటిఫికేషన్‌ జారీ చేయగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 కెజిబివి పాఠశాలల్లో ప్రిన్సిపల్‌, సిఆర్‌టి, పిజిటి, పిఇటి పోస్టులకు సంబంధించి 233 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిగల్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్రమ నియామకాలు జరిగినట్లు తెలిసింది. నోటిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు జరిగాయని బాధితులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
ఉద్యోగ నియామక నిబంధనలు
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యర్థుల విద్యార్హత నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ను బట్టి 1:3, 1:5 నిష్పత్తి ప్రకారం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలవాలి. ఈ వెరిఫికేషన్‌లో మెరిట్‌ ఉన్న అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో స్కిల్‌ టెస్టుకు పిలవాలి. ఈ స్కిల్‌ టెస్టులో ఎవరైతే టీచింగ్‌ (డెమో) బాగా చెబుతారో వారిని సెలెక్షన్‌ కమిటీ మార్కులు కేటాయించి ఎంపిక చేస్తారు. గతంలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెయిటేజ్‌ మార్కులు ఏడాదికి 0.5 కేటాయించారు.
అక్రమ నియామకాలు
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్‌ కమిటీ కావాల్సిన అభ్యర్థులను నియమించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ దరఖాస్తులో తక్కువ మార్కులు వచ్చినా, ఎక్కువ మార్కులు వచ్చినట్లు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేసిన అభ్యర్థులను సెలెక్షన్‌ కమిటీ సర్టిఫికెట్‌ వేరిఫికేషన్‌లో తొలగించకుండా అక్రమ నియామకాలు చేపట్టినట్లు తెలిసింది. నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టుకు తగిన విద్యార్హత లేకపోయినా అభ్యర్థిని నియామకం చేశారు. నోటిఫికేషన్‌లో లేకపోయినా నాన్‌ టీచింగ్‌ సర్వీసును పరిగణనలోకి తీసుకొని, స్కిల్‌ టెస్టులో సెలెక్ట్‌ కాని అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించినట్లు సమాచారం.
కెజిబివిలో చాలామంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తూ జీతం తీసుకుంటూ 2020-21 సంవత్సరంలో రెగ్యులర్‌గా బిఇడి కోర్సు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలిసినా అధికారులు అభ్యర్థికి మళ్లీ ఈ నోటిఫికేషన్‌లో సిఆర్‌టి పోస్టు కల్పించారు. గతంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి 2019లో ఎలాంటి నోటిఫికేషన్‌, మార్గదర్శకాలు లేకుండా అధికారులు మళ్లీ పోస్టు కల్పించారు. 2019-20లో ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా పిఆర్‌టి, పిఇటి పోస్టుల్లో నియమించారు. సమగ్ర శిక్షలో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న వారిని ఎలాంటి మార్గదర్శకాలూ లేకుండా ముడుపులు తీసుకుని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌లోకి మార్పులు చేసినట్లు తెలిసింది.
ఈ అక్రమ పోస్టులు చూస్తుంటే భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమ నియామకాలను రద్దు చేసి, అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.