Aug 12,2023 21:20

ప్రజాశక్తి - వీరఘట్టం : మండలంలోని రేగులపాడు సమీపాన కస్తూర్బా గాంధీ విద్యాలయానికి రాష్ట్రస్థాయిలో అరుదైన అవకాశం లభించిందని ఎస్‌ఒ సిహెచ్‌ రోహిణి విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు శత శాతం ఫలితాలు సాధించడంతో ఈ విద్యాలయానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్టు తెలిపారు. ఇంతటి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యాలయం ఉపాధ్యాయులకు, సిబ్బందికి, తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
వేటుపడినా ఫలితాలు తగ్గలేదు
ఈ ఏడాది ఏప్రిల్‌ 20న రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ కెజిబివిని ఆకస్మిక తనిఖీ చేసి ఎనిమిదో తరగతి విద్యార్థులకు గణితం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని నెపంతో ఎస్‌ఒ సిహెచ్‌ రోహిణి, జిసిడిఒ కె.రోజారమణి, ఎంఇఒ కె.కృష్ణమూర్తి, డిఇఒ రమణను సస్పెండ్‌ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. విద్యాశాఖ అధికారులపై వేటు పడినప్పటికీ పదో తరగతి ఫలితాల్లో కెజిబివి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి, రాష్ట్ర కౌన్సిలర్‌ ఐ.రాజమణి, జిల్లా కార్యదర్శి కె.గోవిందమ్మలు, కెజిబివి విద్యాలయానికి చేరుకుని శతశాతం ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో వీరఘట్టంలోని కెజిబివి ప్రథమ స్థానం సాధించింది. అంటే ఉపాధ్యాయుల కృషి విద్యార్థులపై ఎంత ఉందో వీటికి నిదర్శనం.
అవార్డుల పంట
2020- 23 విద్యా సంవత్సరంలో కేజిబివి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడంతో కెజిబివికి అవార్డుల పంట లభించింది. ఆణిముత్యాలు పేరిట జిల్లాస్థాయిలో కె.రేణుకకు రూ.30వేలు, పి.వాసదేవికి రూ.15 వేలు నగదుతో పాటు నగదు సర్టిఫికెట్లు అందజేశారు. మండల స్థాయిలో రేణుకకు రూ.3వేలు, పి.వాస దేవికి రూ.2వేలు, సార రోజాకు వెయ్యి రూపాయలు చొప్పున నగదు బహుమతిని అందజేశారు. రాష్ట్రంలోనే వీరఘట్టం కెజిబివికి ప్రత్యేకత లభించడంతో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేయనున్నారు..