Aug 13,2023 21:16

అధికారులతో మాట్లాడుతున్న డిఇఒ ప్రేమ్‌కుమార్‌

ప్రజాశక్తి -సీతంపేట : మండలంలో వాబ, బూర్జిమాను గూడ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినిల అదృశ్యంపై జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ ఆదివారం విచారణ చేపట్టారు. మండలంలోని తూరాయిపు వలస సమీపంలో ఉన్న కేజీబీవీ కళాశాల ఒకేషనల్‌ ఎంపిహెచ్‌డబ్ల్యు సెకండ్‌ ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు శనివారం ఒకరికి పుట్టినరోజు కావడంతో ఆరోజు సాయంత్రం వాళ్ల స్నేహితులు కేకు తెచ్చారు. పుట్టినరోజు వేడుకలు జరిగిన వెంటనే శనివారం రాత్రి బయటకు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం విద్యాలయం ప్రత్యేకాధికారి బి.రూప విద్యార్థినిలను లెక్కించగా ఇద్దరు కనిపించలేదు. దీంతో ఆమె డిఇఒకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నీలకంటరావు రంగంలోకి దిగి వాకాబు చేయగా వారి ఇళ్ల వద్దే ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ విచారణలో పాలకొండ డిప్యూటీ డిఇఒ విజయకుమారి, జిసిటిఒ రోజారమణి, ఎంఇఒ సూర్యచంద్రరావు, సూపరింటెండెంట్‌ రంగాచారి తదితరులు ఉన్నారు.