ప్రజాశక్తి -భీమునిపట్నం : నీతి అయోగ్‌లో భాగంగా స్థానిక కెజిబివిని జర్మన్ ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ, సమగ్రశిక్ష అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి.శ్రీనివాసరావు, ఎంఇఒ బాలామణి, డైట్ ప్రిన్సిపాల్ మాణిక్యంనాయుడుతో కలిసి కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జర్మన్ బృందం, విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి, వారి సామర్ధ్యాన్ని పరిశీలించి అంచనా వేశారు. విద్యార్థుల సమాధానాల పట్ల సంతృప్తి చెందారు. రాష్ట్రస్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇటీవల అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించారు. స్టోర్‌రూమ్, వంటగది, లైబ్రరీ, లేబొరేటరీ, ఈ-ప్లస్ క్లబ్‌ను పరిశీలించిన జర్మన్ ప్రతినిధుల బృందం కస్తూర్బా పాఠశాలలోని పరిస్థితులు, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఒ గంగాకుమారి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పలు అంశాలపై జర్మన్ ప్రతినిధుల బృందం చర్చించింది. జర్మన్ ప్రతినిధుల బృందంలో ఇండియన్ అంబాసిడర్ టు జర్మనీ పి.హరీష్, ఇండియన్ అంబాసిడర్ టు నార్వే బి.బాలభాస్కర్ ఉన్నారు.










