ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మధ్యలో బడి మానేసిన వారిని తిరిగి పాఠశాలలో చేర్చేందుకు, తల్లిదండ్రుల్లేని పిల్లలు, చదివించలేని నిరుపేద కుటుంబాల బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ విద్యాలయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అక్కడ బాలికలకు చదువుతోపాటు వివిధ విద్యలు నేర్పుతున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక సమయాన్ని కేటాయించి తర్ఫీదు ఇస్తున్నారు. ప్రత్యేకంగా పోటీలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే అక్కడ విద్యార్థినులు చదువుతోపాటు క్రీడలు, ఇతర అంశాల్లో సత్తా చాటుతున్నారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలు అసమాన ప్రతిభ కనబరుస్తున్నారు.
స్థానిక కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 282 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 6,7,8,9 తరగతులకు చెందిన బాలికలు 168 మంది ఉండగా, 42మంది పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం 40, ద్వితీయ సంవత్సరం 36మంది చదువుతున్నారు. వీరికి కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా చదువు చెబుతున్నారు. పాఠశాల ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

క్రీడల్లోనూ ప్రతిభ
కెజిబివి విద్యార్థినిలు చదువుతోపాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ పాఠశాల విద్యార్థిని తోయక ప్రమీల పూణేలో జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చింది. గత ఏడాది జిల్లా స్థాయిలో జరిగిన క్రీడల్లో ఈ విద్యార్థులు విజేతగా నిలిచి మొదటి స్థానం పొందారు. ప్రతి ఏటా ఇక్కడ నుంచి ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికవుతున్నారంటే క్రీడల్లో వీరు ఎంత ప్రతిభ కనబరుస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలుపొంది అరకు ఎంపి మాధవిచే ప్రశంసలు పొందారు. క్రీడలతో పాటు ప్రతిరోజు ఇక్కడ విద్యార్థులకు యోగా చేయిస్తుంటారు.
అన్నింటా ముందంజ
కెజిబివిలో విద్యార్థినిలు చదువుతో పాటు క్రీడలు, కవితలు, నృత్యం, ఆత్మరక్షణ విద్య ఇలా అన్నింటా ముందుంటున్నారు. ఐదేళ్లుగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పిల్లలను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం. వారి అభిరుచిని బట్టి వారికి ఇష్టమైన అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో విజేతలుగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబర్చి బహుమతులు పొందుతున్నారు. వీరి విజయం కోసం ఉపాధ్యాయులు నిత్యం కృషి చేస్తున్నారు.
సిహెచ్ శ్రీరంజిని ప్రిన్సిపల్, కెజిబివి, గుమ్మలక్ష్మీపురం,










