
ప్రజాశక్తి- పద్మనాభం : మండలంలోని రేవిడి గ్రామంలో సుమారు 12 రోజుల క్రితం మాజీ సైనికుడు ఎం.ఆదినారాయణపై జరిగిన హత్యాయత్నం కేసును స్థానిక సిఐ నీరుగారుస్తున్నారంటూ మాజీ సైనికులు ఆరోపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల వైస్ ప్రెసిడెంట్ పూర్ణచందర్రావు ఆధ్వర్యాన ఆదివారం స్టేషన్ ఎదుట 60 మంది మాజీ సైనికులు ఆందోళన చేశారు. సిఐ ఎం.సన్యాసినాయుడును నిలదీశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రక్షకులుగా పనిచేసిన మేము శాంతియుతంగా పనులు జరగాలనే ఉద్దేశంతో స్థానిక పోలీసులపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పటివరకు ఉన్నామన్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో మాజీ సైనిక సంఘాలతో చర్చించి తదుపరి చర్యకు దిగుతామని స్పష్టంచేశారు. కేసులో పురోగతి లేకుంటే భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. దేశ రక్షకులుగా పనిచేసిన తమకే అన్యాయం జరిగినప్పుడు సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో భూ అక్రమాలు, భూ సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ సైనికుడు ఆదినారాయణపై అధికారులు, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కుమారుడు కోన రమణ దాడికి పాల్పడడం విచారకరమన్నారు. దీనిపై సిఐ సన్యాసినాయుడును వివరణ కోరగా కేసు నమోదైందని, ఉన్నతాధికారుల సూచనలు మేరకే విచారణ సాగుతుందని తెలిపారు.