
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : పెరిగిపోతున్న పెండింగ్ కేసులు పరిష్కారం కోసం జిల్లా న్యాయసవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ని కక్షిధారులు ఉపయోగించు కోవాలని కృష్ణాజిల్లా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా సదన్ లో ఏర్పాటు చేసిన న్యాయమూర్తులు న్యాయ వాదుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కేసులు పరిష్కారం కోసం, డబ్బులు ఆదా, సమయం ఆదా కోసం మీడియేషన్ సెంటర్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని ఆయన సూచించారు. సత్వర కేసులపరిష్కారం వలన ఇరు పక్షాలకు శాంతియుత మార్గం చేకూరుతుందని ఆయన అన్నారు. కేసులు పరిష్కారం కోసం లోకాదాలత్ లు ప్రత్యామ్నాయ వేదికలు, మీడియా సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఎటువంటి కేసు కైనా పరిష్కారం ఉంటుందని దాన్ని పరిష్కరించుకోవడంలో కక్షిదారులు ముందుకు రావాలని అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రామకష్ణయ్య మాట్లాడుతూ కష్ణాజిల్లాలో మధ్యవర్తిత్వ కేంద్రాలు కేసులు పరిష్కారం చేస్తున్నాయని తెలియజేశారు. సుప్రీంకోర్టు ట్రైనింగ్ పొందిన మీడియేటర్లు చేత కేసులు పరిష్కారం కోసం మచిలీపట్నం విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అన్ని సివిల్ కేసులు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఈ మధ్యవర్తి కేంద్రాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.