Sep 29,2023 21:33

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అచ్చన్నాయుడు

కడప అర్బన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన నంద్యాలలో శనివారం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు తెలిపారు. శుక్రవారం నంద్యాలకు వెళుతూ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ టిడిపి నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల టిడిపి అమరావతి ప్రధాన కార్యాలయంలో పొలిటికల్‌ యాక్షన్‌ కమి టీని నియమించామని పేర్కొన్నారు. మొదటి సమావేశం అమరావతిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశాలు జనసేనతో కలిసి అన్ని ప్రాం తాలలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. బాబుపై అక్రమ కేసులు పెట్టి సిఎం జగన్మోహన్‌రెడ్డి పైశాచిక ఆనందంతో ఉన్నారని విమర్శించారు. ఉగ్రవాది కంటే ఘోరంగా బాబుని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన చోటే సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. సిఎం మతిస్థిమితం లేని వాడిగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆధారాలు, సాక్షాధారాలు ఉంటే చూపించమంటే ఇంతవరకు చూపించలేదని ఎద్దేవా చేశారు. సిఐడి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెబుతున్నారని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో లోకేష్‌ను అరెస్టు చేసేందుకు జగన్‌ సిద్ధమయ్యారని పేర్కొన్నారు. అక్రమ కేసులకు జైళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో టిడిపి కడప జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బిటెక్‌ రవి, పుత్తా నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఇన్‌ఛార్జులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మాధవి, నాయకులు సిఎం సురేష్‌నాయుడు, లక్ష్మిరెడ్డి, వికాస్‌ హరికృష్ణ, టిడిపి మైనార్టీ నేత నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌ పాల్గొన్నారు.