ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అంతకంతకూ న్యాయ సంబంధమైన వివాదాలు, భాషణలు, వ్యాఖ్యానాల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఇంకా ఇంకా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇవి ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కూడా లేవు. కొత్త కొత్త కేసులు, పాత కేసుల విచారణలు, ప్రభుత్వ నిర్ణయాలపై స్టేలు, న్యాయమూర్తుల ఆగ్రహ వ్యాఖ్యలు, వాటిపై ఉభయ మీడియాల చిలువలు పలువలు, ప్రభుత్వ ప్రతిస్పందనలు ఇదంతా ఒక వలయంగా మారింది. వైసీపీ టీడీపీ నేతలు దూషణలు, ఆరోపణలు, అవినీతి పురాణాలతోనే సమయమంతా గడిచిపోతున్నది. దేశమంతటా నిరసనకు దారితీసిన రైతు వ్యతిరేక చట్టాలను ఉభయులూ బలపరిచారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చట్టాల ప్రచారానికి ఎ.పి ని ఎన్నుకుంటే వామపక్షాలు, రైతు సంఘాలు నిరసన వినిపించాయి. కాని ఇరుపక్షాల మీడియా లోనూ దానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన, నదీజలాలపై తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు, కేంద్రానికి సర్వాధికారాలు దఖలు పర్చడం వంటి కీలకాంశాలు కూడా మింగేసే స్థాయికి ఉభయ పార్టీల మధ్య వివాదాలు చేరాయి. జగన్ చాలా కాలం తర్వాత ప్రధాని మోడీతో సమావేశమైనా ఎన్‌డిఎ లో చేరతారా లేదా అనే కబుర్లు తప్ప రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విభజన హామీల వంటి వాటిపై కేంద్రీకరణే కరువైంది.
కేసులలో వ్యాఖ్యలు వివాదాలు
ఈ వారం రాజధాని విషయంలోనూ మధ్యంతర ఉత్తర్వులు, స్టేలు ఇచ్చే అంశానికి సంబంధించినవి మొదట తేల్చి తర్వాత ప్రధాన సమస్య లోకి వెళ్లాలని ధర్మాసనం నిర్ణయించింది. 240 పైన వున్న ఈ పిటిషన్ల వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం సాగుతున్నది. సోమవారం మళ్లీ విచారణ మొదలైన తర్వాత కూడా ఎన్ని పిటిషన్లు పూర్తవుతాయన్న ప్రశ్న వుండనే వుంటుంది. ఈ లోగా స్టేటస్‌కో ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోరినా కోర్టు అంగీకరించలేదు. మరోవైపున రాయలసీమ ఉత్తరాంధ్రల నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా సిఆర్‌డిఎ రద్దు చట్టాన్ని బలపరుస్తూ దాఖలైన పిటిషన్లను కూడా అనుమతించింది. ఇదే క్రమంలో శాసనసభ చర్చ నిర్ణయాలు, మండలిలో చర్చ తీరు వంటి వాటి వివరాలు సీల్డు కవరులో సీడీ లో ఇవ్వాలని సభ కార్యదర్శిని ఆదేశించింది. అయితే మండలి రద్దుకూ రాజధాని కేసులకు సంబంధం లేదని ఒక దశలో వ్యాఖ్యానించింది. విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణం స్టేటస్‌కో ఉల్లంఘన అంటూ దాఖలైన పిటిషన్‌ను తర్వాత స్వీకరించనుంది. అలాగే సి.ఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపైనా ప్రశ్నలు నడిచాయి. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే పని చేసుకోవడానికి క్యాంప్ ఆఫీసు వుండొచ్చని చంద్రబాబు హయాం లోనూ హైదరాబాదుతో పాటు ఆయన స్వగ్రామమైన నారావారి పల్లెలో క్యాంపు ఆఫీసు నడిచిందని ఎ.జి వివరించాక కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కోర్టు ఆదేశించింది. రాజధానిలో ఇళ్లస్థలాల కేటాయింపును మాత్రం వేరే కేసుగా పరిగణించి వాయిదా వేసింది. అమరావతి అక్రమాలపై దర్యాప్తు జరగకుండా హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ తాము వేసిన ఎస్‌ఎల్‌పి ని విచారణ తేదీ నిర్ణయించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకు లేఖ రాయడం మరో పరిణామం. ఇలా అనేక కోణాల లో రాజధాని సమస్య రాజకీయంగా న్యాయపరంగా మధనం జరుగుతుండగా ప్రధాని మోడి ముఖ్యమంత్రిని మొదట మెచ్చు కోవడం, తర్వాత ప్రత్యేకంగా కలుసుకోవడం కేంద్ర మద్దతుకు పరోక్ష సంకేతం అనే అభిప్రాయం వుంది. ఎన్‌డిఎలో వైసీపీ చేరిక కథనాలు కూడా జోరుగా నడిచినా ఏ పక్షమూ గట్టిగా ఖండించలేదు. ప్రత్యేక హోదా ఇస్తే పరిశీలిస్తామని జగన్ అన్నట్టు ఒక వార్త కాగా షరతులు పెట్టే సత్తా ఎక్కడుందని అపహాస్యాలు వ్యతిరేక మీడియాలో నడిచాయి.
యుద్ధ వాతావరణమా?
రాజధాని కేసుల విచారణ, ఆదేశాలు ఒకటైతే అంతకు మించి రాజకీయ వ్యాఖ్యలు వాతావరణం వేడెక్కిస్తున్నాయి. న్యాయవ్యవస్థ పైన మంత్రులు పాలకపార్టీ పెద్దల వ్యాఖ్యల పట్ల అభ్యంతరం ప్రకటిస్తూ పార్లమెంటులో హైకోర్టు మూసి వేయమని అడగండని జస్టిస్ రాకేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇదే అంశం వచ్చినప్పుడు గత వారం తరహాలోనే హైకోర్టుపై యుద్ధం ప్రకటించినట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పేదల కోసం చేసే నిర్ణయాలకు కోర్టులు అడ్డు తగిలితే తిరుగుబాటు రావచ్చని స్పీకర్ చేసిన వ్యాఖ్యకు ఇది ప్రతిస్పందన. శాసనసభ, హైకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవే, రాజ్యాంగం 211 అధికరణం ప్రకారం కోర్టుల పనిని, సభ చర్చించకూడదు (నిబంధనల ప్రకారం జడ్జిలను అభిశంసించే సందర్భంలో తప్ప) అలాగే 212 ప్రకారం సభ పనిని ఆదేశాలను కోర్టులు ప్రశ్నించకూడదు. చేసిన శాసనాలు రాజ్యాంగ మౌలిక స్వభావానికి అనుగుణంగా వున్నాయా లేదా అని మాత్రం సమీక్షించవచ్చు. 226వ అధికరణం ప్రకారం హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్, హెబియస్ కార్పస్, కో వారంటో, ప్రొహిబిషన్ తదితర పిటిషన్లను తీసుకుంటుంది. 32వ అధికరణ ప్రకారం సుప్రీం కోర్టుకున్న అధికారాలకు లోబడి తన పరిధిలో ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చు. 78వ అధికరణం, ఎ.పి శాసనసభ నియమావళి మేరకు సభాపతి సభ నిర్వహణలో సర్వాధికారాలు కలిగివున్నా చేసిన శాసనాలపై కోర్టుల సమీక్షను ఆక్షేపించడానికి లేదు. ఇక్కడే స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా మారాయి. పైగా అవి సభ వెలుపల చేసినవి తప్ప విధి నిర్వహణలో భాగంగా కాదు.
సుప్రీం కోర్టు, జగన్ బాబు కేసులు
సోషల్ మీడియాలో కోర్టుకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులు పెట్టిన వారిపైనా బయిట రాజకీయ వ్యాఖ్యలు చేసిన వారిపైన కేసులు నమోదు చేయాల్సిందిగా ఇదివరకే సిఐడికి ఆదేశాలు ఇచ్చినా కేసులు పెట్టకపోవడమే గాక స్పీకర్, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎం.పి విజయసాయి రెడ్డి వంటి వారిని ఉపేక్షించడం కోర్టు కోపానికి కారణమైంది. ఇలా అయితే సిబిఐని దించాల్సి వస్తుందని న్యాయమూర్తులు అన్నదానికి అడ్వకేట్ జనరల్ కూడా అభ్యంతరం లేదన్నారు. తమాషా ఏమంటే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీరాం పై దాఖలైన ఎప్‌ఐఆర్‌ను ప్రసారం చేయొద్దని హైకోర్టు ఆంక్షలు పెట్టడం మీడియా లోనూ రాజకీయ వర్గాలలోనూ తీవ్ర విమర్శకు గురైంది. ప్రస్తుతం అది సుప్రీం కోర్టు ముందుంది. కాని తన పైన ఫేస్‌బుక్‌లో పోస్టులు వస్తున్నాయని ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయిస్తే వాటిని ఎలా అదుపు చేయాలని కోర్టు ప్రశ్నించడం. ఫేస్‌బుక్‌ను కేంద్రమే నియంత్రించాలని పైగా ఆ పిటిషన్‌లో దాన్ని ప్రతివాదిగా చేర్చలేదని ఎ.జి జవాబిచ్చారు. గతంలో చేపట్టిన జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ కథనాలకు సంబంధించిన కేసు కూడా వచ్చింది. ఆ వార్త ప్రచురించిన పత్రికకు తాము లీగల్ నోటీసులు ఇచ్చామని ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అడ్వర్టయిజ్‌మెంట్ల విడుదలపై ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి టిడిపి బినామీ కనక దానికీ విచారణార్హత లేదన్నది. 'సాక్షి'లో వార్తలపై సి.జె జె.కె.మహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేస్తే 'ఆంధ్రజ్యోతి'లో కథనాలపై మరో న్యాయవాది ప్రస్తావన చేశారు. అయితే అది మరో కేసులో విచారిస్తున్నందున తాము స్పందించబోమని సి.జె అన్నారు. ప్రభుత్వం తరపున మాట్టాడిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టులపై గౌరవం ప్రకటిస్తూనే న్యాయమూర్తులు వ్యాఖ్యలలో సంయమనం పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. వాటిని తీర్పులలో లిఖిత పూర్వకంగా చేరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశముంటుందని, యథాలాపంగా అనడం వల్ల కొన్ని పత్రికలు వాటిని పెద్దవి చేయడంతో కోర్టులతో యుద్ధం జరుగుతుందనే భావన ఏర్పడుతుందన్నారు. ఈ న్యాయ మీమాంసలో కొసమెరుపు స్థానిక ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మళ్లీ తెర పైకి రావడం. గతంలో కరోనా కారణంగా ప్రభుత్వానికి తెలియకుండా ఎన్నికలు వాయిదా వేయడం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో వైరుధ్యానికి బీజం వేసింది. ఇప్పుడు దేశంలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుంటే స్థానిక ఎన్నికలు ఎందుకు జరపడం లేదని ఒక న్యాయవాది పిటిషన్ వేశారు. కరోనా వల్ల జరపలేమని ప్రభుత్వం చెప్పగా ఆ మాట ఎన్నికల కమిషన్‌కు చెప్పాలంటూ కోర్టు దానికి కూడా నోటీసు పంపించింది. నవంబరు 2న ఈ కేసు విచారణ మళ్లీ మొదలయ్యేనాటికి ఏమవుతుందో చూడాల్సిందే. సుప్రీం కోర్టు కూడా ఇంగ్లీషు మీడియంపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ క్రమంలో మాతృభాషలో బోధన ఉపయోగకరమన్న వ్యాఖ్యలు చేసి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పరిధిలో జగన్ చంద్రబాబుతో సహా ప్రధాన నేతలపై వున్న కేసుల విచారణ వేగం పెంచుతారనే హడావుడి మొదలైంది. జగన్‌పై వున్న 11 కేసులను రోజువారి విచారణ చేస్తామంటూ సోమవారానికి వాయిదా వేశారు. అప్పటికి విచారణ ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోవచ్చు
ప్రతిష్టంభనలో ప్రశ్నార్థకాలు
ఈ విధంగా మొత్తంపైన చూస్తే ఎ.పి రాజకీయాలు ఎడతెగని కోర్టు వాజ్యాలలో చిక్కుకుపోయినట్టు స్పష్టమవుతుంది. ఈ ఏడాదిలో రాజధాని కేసులు ముగియకపోవచ్చని స్పష్టమమవుతున్నది. ఆ తర్వాత ఏదో ఒక పక్షం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుంది గనక మరింత జాగు తప్పదు. ఈ ప్రతిష్టంభన ప్రజా సమస్యలపై, పరిపాలనా సమర్థతపై దృష్టి కేంద్రీకరించడానికి అవరోధంగా మారుతున్నది. అసహన వ్యాఖ్యలు పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నాయి. సంక్షేమ పథకాలు సాగుతున్నా అప్పులు అనుదినం కొండలా పెరిగి ఆందోళనకరం అవుతున్నాయి. పాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ కేంద్రంగా మరో తరహా వివాదాలు పెరుగుతున్నాయి. గతంలో జరిగిన తప్పులు కదిలిస్తే కక్ష సాధింపు అని టిడిపి ఇప్పుడు మంత్రి గుమ్మనూరు జయరాం వంటివారిపై ఆరోపణలు వస్తే వైసీపీ సమర్థించుకోవడమే జరుగుతున్నది. వ్యవసాయ విద్యుత్ మోటార్లు, పట్టణ ప్రజలపై భారాలు, గ్యాస్‌పై వడ్డింపులు, పోలీసుల పక్షపాతాలు వీటిపై ఉద్యమాలు పెరుగుతున్నాయి. అమరావతి ఆందోళన మూడువందల రోజులకు చేరినా గుర్తించి చర్చించకపోగా పెయిడ్ ఆర్టిస్టులనే అవహేళనే కొనసాగుతున్నది. ఎంత భారీ మెజార్టీ వున్నా ఈ స్పందనా రాహిత్యం, ఏకపక్ష సమర్థనలు రాష్ట్రానికి, ప్రజలకు హానికరం. ఇదే సమయంలో కేంద్రానికి వంతపాడటం తప్ప ఒక్కసారైనా ప్రశ్నించలేని పరిస్థితిలో పాలక పక్షం పడిపోయింది. అందుకే కేసులు, వివాదాలు తప్ప విశాల ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి ప్రశ్నార్థకం అవుతున్నాయి.
(ఈ వ్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు లేఖ రాసిన వార్త వెలువడక ముందు రాసినది)










