Aug 19,2023 22:25

న్యాయవాదులు, పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న న్యాయమూర్తులు

        హిందూపురం : కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ కోరారు. శనివారం స్థానిక ఏడీజే కోర్టు ఆవరణలో మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహణపై సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీధర్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్యలక్ష్మి, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సుకుమార్‌లతో కలిసి న్యాయవాదులు, పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్‌ 9వ తేదీ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న అన్ని కేసులనూ పరిష్కరించేందుకు అటు పోలీసులు, ఇటు న్యాయవాదులు కషి చేయాలన్నారు. కక్షిదారులు కూడా కోర్టులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగి వ్యయప్రయాసాలకు గురికాకుండా రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రాజీ కాదగిన క్రిమినల్‌ కేసులను కూడా గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రత్యేకంగా బెంచ్‌ లను ఏర్పాటు చేసి అప్పటికప్పుడే కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అనంతరం జరిగిన లోక్‌అదాలతో పలు కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎజిపి శ్రీనివాస్‌ రెడ్డి, ఏపీపీ నగేష్‌, న్యాయవాదులు సుదర్శన్‌, సిద్దు, కళావతి, నవేరా, నారాయణ గౌడ్‌, రాఖీబ్‌, వన్నూరప్ప, లోక్‌ అదాలత్‌ శారద, హేమావతి పాల్గొన్నారు.