Feb 24,2023 00:24
నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో గంజాయిని కట్టడిచేసేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. గురువారం బాపట్ల జిల్లా ఎస్‌పి క్యాంప్‌ కార్యాలయ సమావేశ హాలులో జిల్లా పోలీస్‌ అధికారులతో ఎస్‌పి నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో స్పందన పిటిషన్లు, పోక్సో కేసులు, గ్రేవ్‌ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్‌ కేసులు, 174 సిఆర్‌పిసి కేసులు, మిస్సింగ్‌ కేసులు, సర్కిల్‌ క్రైమ్‌ పార్టీల పనితీరు, గంజాయి, నాటుసారాల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి ఎస్‌పి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ దిశ కాల్స్‌, 112, 100 వంటి అత్యవసర కాల్స్‌కు తక్షణం స్పందించాలన్నారు. వెనువెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. కాల్‌ వచ్చిన సమయం, అధికారి ఘటన స్థలానికి చేరుకున్న సమయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అత్యవసర కాల్స్‌ పట్ల అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులను హెచ్చరించారు. గంజాయి విక్రయించే వారు ఎక్కువగా విద్యార్థులు, యువతనే లక్ష్యంగా చేసుకొని గంజాయిని విక్రయిస్తున్నారన్నారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించి వారి విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. కనుక జిల్లా పోలీస్‌ అధికారులు గంజాయిని కట్టడి చెయ్యడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. పోక్సో కేసులలో విచారణ వేగవంతం చేయాలన్నారు. 60 రోజులలోపు విచారణ పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలన్నారు. నేర సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం జిల్లాలో నేర ఛేదనలో, లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది పోలీస్‌ అధికారులు సిబ్బందిని ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి పి మహేష్‌, డిసిఆర్బి డిఎస్పి జి లక్ష్మయ్య, బాపట్ల, రేపల్లె సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ ఏ శ్రీనివాస రావు, టి మురళీకృష్ణ, ఎస్సీ - ఎస్టీ సెల్‌ డిఎస్పి ఏవి రమణ, డిఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఎ శ్రీనివాస్‌, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ పి బాలమురళీకృష్ణ, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం మురళీకృష్ణ, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్స్‌, అన్ని పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, డిపిఓ అధికారులు పాల్గొన్నారు.