ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:కేరళ రాష్ట్రంలో గ్రంథాలయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని విశాఖ జిల్లా పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు బి.ఎల్ నారాయణ, కె.త్రిమూర్తులు కొనియాడారు. 2022 డిసెంబర్ 27 నుండి 2023 జనవరి మూడో తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కన్నూరు యూనివర్సిటీలో జరిగిన మొట్టమొదటి ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌లో ఆంధ్ర రాష్ట్రం నుండి వీరు ప్రతినిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో విలేకరులతో త్రిమూర్తులు మాట్లాడుతూ, కన్నూరు జిల్లా గ్రామీణ ప్రాంతంలోని గ్రంథాలయాల నిర్వహణను చూసి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ గ్రంథాలయాలు ప్రజా సాంస్కతిక కేంద్రాలుగా నడుస్తున్నాయన్నారు. వారం రోజుల పాటు జరిగిన లైబ్రరీ కాంగ్రెస్లో బుక్ ఫెస్ట్, లైబ్రెరియన్స్ మీట్, కల్చరల్ మీట్, వాకర్స్, స్టూడెంట్స్, మ్యూజికల్ మీట్స్ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారన్నారు. జనవరి ఒకటి నుండి మూడో తేదీ వరకు ప్రముఖులతో వివిధ అంశాలపై ఏకకాలంలో 13 సెమినార్లు నిర్వహించారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రతినిధులు లైబ్రరీ కాంగ్రెస్ కు ప్రతినిధులుగా హాజరయ్యారన్నారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అనేకమంది మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, కవులు, కళాకారులు పాల్గొన్నారన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అత్యంత జయప్రదంగా నిర్వహించారని తెలిపారు.










