ప్రజాశక్తి అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు కేరళ తరహాలో భద్రత కల్పించాలని ఆసుపత్రులపై దాడులను నిరోధించాలని ఐఎంఎ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఆదివారం అనంతపురంలో స్థానిక ఐఎంఎ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ భారతీయ వైద్య సంఘం( ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ) ప్రపంచంలోనే అతి పెద్ద వృత్తి సంఘమని అన్నారు. ఐఎంఎ ప్రయివేటు వైద్యుల సంఘం అనే అపోహ ఉందని, తమ సంఘం సభ్యులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలు అందిస్తున్నారని అన్నారు. వైద్యుల రక్షణ చట్టం పటిష్టం చేయాల్సిన అవసరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇటీవల కేరళలో యువ వైద్యురాలు వందనా దాస్ హత్యకు గురైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో వైద్య రక్షణ చట్టాన్ని కఠిన తరం చేశారని చెప్పారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో చట్టాన్ని అమలు చేస్తే వైద్యులకు భద్రత కల్పించినట్లు అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయి వైద్యుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వైద్యులపై కేసుల నమోదుకు నిర్దిష్ట నియమావళి ఉండాలన్నారు. రాష్ట్రంలో అధిక శాతం ప్రజలకు ప్రైవేటు రంగంలోనే వైద్యం అందుతోందనిఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేసే సమయంలో ఉన్న వివిధ అనుమతులు,లైసెన్సులు ఏక గవాక్ష విధానంలో ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని మరింత విస్తృతం చేసిన ప్రభుత్వ తీరు హర్షనీయమన్నారు. అయితే 20 పడకల ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తే పేద సామాన్య ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల నుండి సేకరించే ఆసుపత్రి వ్యర్ధాల రుసుములు నిర్వహణ వ్యయానికి అనుగుణంగా ఉండాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సలహా కమిటీలో ఐఎంఎతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. శిక్షణ లేని వైద్యం చేస్తున్న క్లినిక్ ల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య పురస్కారాలు ఇవ్వాలన్నారు. ఐఎంఎ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ అన్ని రకాల వైద్య విధానాలపై ఐఎంఎకు గౌరవం ఉందని చెప్పారు. ప్రజలకు ఏ వైద్య విధానం కావాలో వారే నిర్ణయించుకుని ఆ వైద్య విధానంలో చికిత్స పొందడానికి అవకాశం కల్పించాలని, కోరారు. ఐఎంఎ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ జి.హేమలత మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం రాష్ట్రములో ఉన్న 98 ఐఎంఎ శాఖల ద్వారా వైద్యులకు నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆధునిక వైద్య విజ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఐఎంఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోరంజన్ రెడ్డి ప్రతి ఐఎంఎ శాఖ ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకుని ఆ గ్రామంలో సమగ్ర ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ఐఎంఎ రాష్ట్ర కోశాధికారి రవీంద్రనాథ్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఎవి.సుబ్బారెడ్డి, అనంతపురం ఐఎంఎ కార్యదర్శి డాక్టర్ అభిషేక్ రెడ్డి, సీనియర్ వైద్యులు రామసుబ్బయ్య, రామ సుబ్బారావు, అచ్యుత ప్రసాద్, కొండయ్య, శ్రీనాథ్, గేయానంద్, ప్రసూన, సుధీంద్ర, సతీష్, సత్యనారాయణ, గోపి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.










