Nov 29,2021 07:49

ఎప్పుడూ మనకు తెలిసిన వంటలు చేసి తింటే వెరైటీ ఏముంటుంది? అప్పుడప్పుడూ ఇతర రాష్ట్రాల వంటలనూ రుచి చూస్తే బాగుంటుంది కదా! అందుకే ఈ వారం కేరళ సూప్స్‌ పరిచయం చేస్తున్నాం. ఇంకెందుకాలస్యం వెంటనే తయారుచేసి, కుటుంబసభ్యులతో 'సూప్స్‌ అదరహో' అనిపించుకోండి.

                                                                     మటన్‌ సూప్‌

కేరళ సూప్స్‌ అదరహో...

కావాల్సిన పదార్థాలు : తక్కువ మాంసంతో ఉన్న మటన్‌ ఎముక ముక్కలు- 300 గ్రాములు, సొరకాయ ముక్కలు- పది, పచ్చిమిర్చి- 3 లేదా 4, వెల్లుల్లి రెబ్బలు- 8, అల్లం- చిన్నముక్క (తరిగినది), టమోటా- ఒకటి (తరిగినది), కొబ్బరినూనె- 2 లేదా 3 స్పూన్లు, పసుపు- స్పూను, మిరియాల పొడి- రుచికి తగినంత, గరంమసాలా- స్పూను, నిమ్మకాయ- ఒకటి, కొత్తిమీర- కొద్దిగా (గార్నిష్‌ కోసం), కందిపప్పు- అరకప్పు, ఉప్పు- తగినంత, నీళ్లు- ఒకటి లేదా ఒకటిన్నర లీటర్లు, కరివేపాకు- కొద్దిగా.

తయారుచేసే విధానం :
ముందుగా కుక్కర్‌లో నూనె పోసి, వేడిచేయాలి. కొంచెం గరంమసాలా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకుతోపాటు ఉప్పు వేయాలి. వాటిని 2-3 నిమిషాలు వేయించాలి. అందులోనే తరిగిన టమోటాలు వేసి మెత్తగా అయ్యేవరకూ మరో మూడు నిమిషాలు వేయించాలి.
ఇంకా పసుపు, సగం మిరియాల పొడి వేసి, నిమిషం పాటు వేయించాలి. తర్వాత నీళ్లు, కొత్తిమీర వేసి, బాగా ఉడకనివ్వాలి.
అందులోనే నానబెట్టిన కందిపప్పు వేయాలి. కుక్కర్‌లో ఉన్న నీళ్లు తగ్గి, సూప్‌ చిక్కబడేవరకూ ఉడకనివ్వాలి. అందుకుగాను 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.
తర్వాత రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఇంకా మిగిలిన గరంమసాలా, మిరియాల పొడి వేయాలి. రుచికి నిమ్మరసాన్ని జోడించాలి.
మంచి రుచి కోసం సూప్‌ను వడకట్టాలి. తరిగిన కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా సర్వ్‌ చేసుకోవడమే.

                                                                 వెజిటబుల్‌ సూప్‌

కేరళ సూప్స్‌ అదరహో...

కావాల్సిన పదార్థాలు :  బంగాళా దుంపలు- రెండు, క్యారెట్‌- ఒకటి (ముక్కలుగా తరగాలి), గ్రీన్‌బీన్స్‌- పది (పొడవుగా కత్తిరించాలి), పచ్చిమిర్చి- 2 లేదా 3 (పొడవుగా తరుక్కోవాలి), కొబ్బరిపాలు- 250 మిల్లీలీటర్లు, ఉప్పు- తగినంత, లవంగాలు- 3, నల్ల మిరియాలపొడి- స్పూను, చక్కెర- స్పూను, కరివేపాకు- రెమ్మ, కొబ్బరినూనె- రెండు స్పూన్లు, ఎండుమిర్చి- ఒకటి.
 

తయారుచేసే విధానం :
ముందుగా కూరగాయలన్నింటినీ కట్‌ చేసుకోవాలి. తర్వాత వాటిని ఆవిరి మీద ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్‌లో ఉడికించిన కూరగాయలు, కొబ్బరిపాలు, కరివేపాకు, లవంగాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని కలియబెడుతూ బాగా ఉడికించుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు, పంచదార వేసుకోవాలి.
సూప్‌ పల్చగా రావాలంటే కొద్దిగా నీటిని పోయాలి. అయితే గ్రేవీ నీరుగా ఉండకుండా చూసుకోవాలి. చివరగా కొబ్బరినూనె వేసి, మరికొన్ని నిమిషాలు ఉడకబెట్టాలి.
తర్వాత స్టౌ ఆపి, పది నిమిషాలు సూప్‌ని పక్కన పెట్టాలి. అంతే వెజిటబుల్‌ సూప్‌ రెడీ!

                                                                     టమోటా సూప్‌

కేరళ సూప్స్‌ అదరహో...

కావాల్సిన పదార్థాలు : టమోటాలు- 10 లేదా 12 (సుమారైనవి), చక్కెర- స్పూన్‌, క్రీమ్‌- పావు కప్పు, నూనె - అర స్పూన్‌, వెన్న - స్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, నల్ల మిరియాలు - 4 లేదా 6, ఉల్లిపాయ - ఒకటి (తరిగినది), కొత్తిమీర- 2 అంగుళాల ముక్క (సన్నగా తరగాలి), వెల్లుల్లి - 4 (తరగాలి), క్యారెట్‌ - సగం క్యారెట్‌ (గుండ్రంగా కట్‌ చేసుకోవాలి), ఉప్పు- సరిపడా, నల్ల మిరియాల పొడి - అరస్పూన్‌, నీళ్లు- 3 కప్పులు.
 

తయారుచేసే విధానం :
ముందుగా చక్కెర, క్రీమ్‌ మెత్తగా కలపాలి.
పాన్‌లో నూనె, వెన్నను వేసి వేడిచేయాలి. అందులో బిర్యానీ ఆకు, మిరియాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి బంగారు వర్ణం వచ్చేవరకూ వేయించాలి.
తర్వాత క్యారెట్‌ ముక్కలు, టమోటాలు వేసి, నిమిషంపాటు వేయించాలి. అందులోనే నీళ్లుపోసి, పది నుంచి పదిహేను నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. అందులో ఉన్న బిర్యానీ ఆకును తీసేసి, ఫిల్టర్‌లో మిశ్రమాన్ని వడకట్టి, వచ్చిన నీటిని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మిశ్రమాన్నంతా మిక్సీలో వేసి, మెత్తగా రుబ్బుకోవాలి. వడకట్టి పక్కన పెట్టుకున్న నీటిని రుబ్బుకున్న మిశ్రమంలో కలపాలి.
అందులోనే మిరియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు వేడిచెయ్యాలి. తాగే ముందు ముందుగా కలిపి పెట్టుకున్న చక్కెర, క్రీమ్‌ను వేస్తే చాలా రుచిగా ఉంటుంది.

                                                                   కాలీఫ్లవర్‌ సూప్‌

కేరళ సూప్స్‌ అదరహో...

కావాల్సిన పదార్థాలు : క్యాలీఫ్లవర్‌- ఒకటిన్నర కప్పు, జీడిపప్పు- రెండు స్పూన్లు, ఉల్లిపాయ- ఒకటి, అల్లం- అరస్పూను (సన్నగా తరిగినది), లవంగాలు- రెండు, జీలకర్ర పొడి- అర స్పూను, పసుపు- పావు స్పూను, నల్ల మిరియాలు- రుచికి తగినన్ని, నీళ్లు- రెండున్నర కప్పులు, కూరగాయలు- కొంచెం, ఆలివ్‌నూనె- 2 స్పూన్లు, ఉప్పు- తగినంత.
 

తయారుచేసే విధానం :
క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా విడదీసి, వేడినీళ్లల్లో ఉప్పు, పసుపు వేసి, శుభ్రం చేసుకోవాలి.
ఉల్లిపాయలు, అల్లం తరిగి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేడి చేయాలి. అందులో లవంగాలు వేసి రెండు సెకన్ల పాటు వేయించాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వేసుకోవాలి. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే వరకూ వేయించాలి.
అందులోనే ఉప్పు, పసుపు, జీలకర్ర పొడితో పాటు క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
తరిగిన జీడిపప్పు, నీరు, కూరగాయల ముక్కలను వేసి, బాగా ఉడకనివ్వాలి. తర్వాత సూప్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
సూప్‌ చల్లారిన తర్వాత, 10-12 నిమిషాలు క్యాలీఫ్లవర్‌ మెత్తగా ఉడికే వరకూ తక్కువమంట మీద ఉంచాలి.
క్యాలీఫ్లవర్‌ బాగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. అప్పుడు లవంగాలు వేసి మొత్తాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని పాన్‌లోకి మార్చుకోవాలి. రుచికి నల్ల మిరియాల పొడిని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి మరలా సూప్‌ వేడిచేసుకోవాలి. అంతే క్యాలీఫ్లవర్‌ సూప్‌ రెడీ. జీడిపప్పులతో గార్నిష్‌ చేసి, సర్వ్‌ చేసుకోవాలి.