ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
దేశంలో మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్న 'కేరళ స్టోరీ' సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని ఎంపిజె రాష్ట్ర సెక్రటరీ లాల్కోట్ మహ్మద్ ఖదిర్ బాష డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో తహశీల్దార్ జయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో వాస్తవ కథ అని చెబుతూ అవాస్తవాలను సినిమాలుగా తీస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడం సిగ్గుచేటన్నారు. ఒక మతం వారిని లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీయడం, వాటికి సంఫ్‌ు పరివార్ మద్దతు పలకడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఈ మధ్యనే అబద్ధాలు, కల్పనతో 'కాశ్మీర్ ఫైల్స్' అనే సినిమా తెరకెక్కించారని చెప్పారు. పూర్తి అవాస్తవాలతో, అభూత కల్పనతో ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించిన 'కేరళ స్టోరీ' సినిమా దేశంలో వివాదాస్పదమైందని తెలిపారు. ఈనెల 20లోపు నిర్మాతలు సినిమా సృజనాత్మక సృష్టిగా డిస్ క్లయిమర్‌ను ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సినిమా అవాస్తవికతను తెలియపరుస్తుందని అన్నారు. ఇలాంటి వివాదాస్పదమైన సినిమాలకు క్లియరెన్స్ ఇస్తున్న కేంద్ర సెన్సార్ బోర్డుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, అబ్దుల్ కలాం, తాహెర్, అబ్దుల్ రెహమాన్, ఉదరు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










