అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయిన తర్వాత భిన్నమైన 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు'గా మారారు. ఏ ఎన్నికల ముందైనా ప్రధానమైన రాజకీయ ప్రత్యర్ధులను కేంద్ర సంస్థలతో 'ఎన్‌కౌంటర్' చేయిస్తారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను ఇలాగే చేశారు. ఇ.డి విచారణకు ఆయనకు సమన్లు పంపారు. కానీ, కేంద్ర సంస్థల ఈ తరహా జోక్యం కేరళలో మరీ మితిమీరిపోయింది. ముఖ్యమంత్రిని, ఎల్‌డిఎఫ్ మంత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి బోర్డు (కెఐఐఎఫ్‌బి) వంటి రాష్ట్ర ప్రాయోజిత సంస్థలను, ప్రభుత్వ పథకాలను, మిషన్లను కూడా వదిలిపెట్టడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు చాలా పకడ్బందీగా ఇదంతా జరుగుతోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ నాయకత్వం లోని యుడిఎఫ్, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ పోటీ పడుతున్నాయి. గతేడాది జులైలో బంగారం అక్రమ రవాణా కేసుతో మొదలుపెట్టి పలు తప్పుడు ఆరోపణలతో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బిజెపిలు ప్రచారం చేస్తున్నాయి.
ఇప్పుడు ఎన్నికల బరిలోకి తృతీయ పక్షం వచ్చింది. కాంగ్రెస్, బిజెపి లకు తోడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి), సిబిఐ, కస్టమ్స్, ఎన్‌ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా వున్నాయి.
ఈ కేంద్ర సంస్థల జోక్యం గతంలో ఎన్నడూ లేని విధంగా వుంది. చట్టబద్ధమైన, సంస్థాగతమైన అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ సూత్రాలకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. గతంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ విధంగా జరగలేదు.
కేంద్రంలోని బిజెపి గతంలో రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకునేందుకు ఇ.డి, సిబిఐ, ఐ.టి అధికారులను ఉపయోగించుకునేది. అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయిన తర్వాత భిన్నమైన 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు'గా మారారు. ఏ ఎన్నికల ముందైనా ప్రధానమైన రాజకీయ ప్రత్యర్ధులను కేంద్ర సంస్థలతో 'ఎన్‌కౌంటర్' చేయిస్తారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను ఇలాగే చేశారు. ఇ.డి విచారణకు ఆయనకు సమన్లు పంపారు. కానీ, కేంద్ర సంస్థల ఈ తరహా జోక్యం కేరళలో మరీ మితిమీరిపోయింది. ముఖ్యమంత్రిని, ఎల్‌డిఎఫ్ మంత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి బోర్డు (కెఐఐఎఫ్‌బి) వంటి రాష్ట్ర ప్రాయోజిత సంస్థలను, ప్రభుత్వ పథకాలను, మిషన్లను కూడా వదిలిపెట్టడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు చాలా పకడ్బందీగా ఇదంతా జరుగుతోంది.
ఎన్‌ఐఎ దర్యాప్తు జరుపుతున్న బంగారం అక్రమ రవాణా కేసులో వివిధ మంత్రులు, నేతలను ఇరికించేందుకు ఇ.డి, కస్టమ్స్ అధికారులు శతథా ప్రయత్నించారు. కన్‌సైన్‌మెంట్ తేదీలకు సంబంధించి, అలాగే రంజాన్ మాసంలో పంపిణీ కోసం యుఎఇ కాన్సులేట్ నుండి అందుకున్న ఖురాన్ కాపీలకు సంబంధించి మైనారిటీ సంక్షేమ మంత్రి కె.టి.జలీల్‌ను ఇ.డి ప్రశ్నించింది. బంగారం అక్రమంగా రవాణా అయిందంటూ దిగుమతి చేసుకున్న తేదీలతో సహా తప్పుడు సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కొన్ని వర్గాలు లీక్ చేశాయి. దాంతో మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, బిజెపి లు వీధుల్లో నినదించాయి. 20 మందిపై ఛార్జిషీట్లు దాఖలు చేసిన, ఆరు మాసాల పాటు దర్యాప్తులు చేపట్టిన ఎన్‌ఐఎ...మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి శివశంకర్ మీదగాని, మరే ఇతర రాజకీయ నేతపై గాని నేరారోపణ చేయలేకపోయింది.
నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, బిజెపి లకు ఉపయోగపడేందుకే...అసత్యాలను, పుకార్లను వ్యాప్తి చేసేందుకు ఈ బంగారం అక్రమ రవాణా కేసును ఉపయోగించుకున్నారు.
బంగారం అక్రమ రవాణా కేసులో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేమీ దొరకకపోవడంతో 'లైఫ్ మిషన్' వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని ఇ.డి, సిబిఐ దర్యాప్తు ప్రారంభించాయి. సిబిఐ జోక్యానికి, 'లైఫ్ మిషన్' అధికారులపై కేసు నమోదు చేయడానికి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారమైంది. పేదలకు రెండున్నర లక్షల ఇళ్లు ఇచ్చేందుకు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో 'లైఫ్ మిషన్' ఒకటి. 'కె ఫాన్' (నిరుపేద వర్గాలకు ఇంటర్‌నెట్ సదుపాయాన్ని అందచేసే ప్రాజెక్టు), ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వంటి ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి పత్రాలు కావాలని ఇ.డి డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో రకంగా నేరారోపణ చేయడమే ఈ దర్యాప్తులు, విచారణల లక్ష్యంగా వుంది.
ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిజెపి ర్యాలీలో ప్రసంగిస్తూ, కెఐఐఎఫ్‌బి కి, ఫిబ్రవరి 28 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు వ్యతిరేకంగా పలు తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ వెంటనే, ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో పని చేసే ఇ.డి...'ఫెమా' (విదేశీ మారక ద్రవ్య నిర్వహణా చట్టం) కింద కేసు దాఖలు చేసింది. విచారణ కోసం కెఐఐఎఫ్‌బి ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెట్టుబడులను కెఐఐఎఫ్‌బి సమీకరిస్తుంది. హైవేలు, పాఠశాల భవనాలు, ఆస్పత్రి భవనాలు వంటి వాటికి సంబంధించి రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేసింది. ఇవి, కేరళ లోని సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకు వచ్చాయి. నిరాధారమైన ఆరోపణలు లేవనెత్తడం ద్వారా ఈ క్రమానికి ఆటంకం కలిగించడమే ఇ.డి చర్యల ఉద్దేశ్యంగా వుంది.
కస్టమ్స్ శాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ద్వారా తాజా దాడి జరిగింది. డాలర్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, మరో ముగ్గురు మంత్రులు వున్నారని పేర్కొంటూ బంగారం అక్రమ రవాణా కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ చేసిన 'సమ్మతి ప్రకటన' అందులో వుంది. పూర్తిగా సంబంధం లేని కేసులో కస్టమ్స్ అఫిడవిట్ అందచేసింది. జ్యుడీషియల్ కస్టడీలో వున్న స్వప్న సురేష్‌కు అందించిన భద్రతపై దిగువ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జైళ్ళ డైరెక్టర్ జనరల్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి సంబంధించినది ఈ కేసు. కానీ, కస్టమ్స్ అఫిడవిట్ అడ్డదారిలో ముఖ్యమంత్రిని, ఇతర ప్రభుత్వ అధికారులను ఇందులో ఇరికించింది. అయితే ఈ క్లెయిమ్‌లను నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాధారాలేవీ లేవని స్వయంగా ఆ సంస్థే అంగీకరించింది.
స్వప్న సురేష్ ఇటువంటి ప్రకటన చేసేలా ఒత్తిడి తీసుకువచ్చారనడానికి తగిన రుజువులు వున్నాయి. గతేడాది నవంబరు 18న రికార్డయిన స్వప్న సురేష్ వాయిస్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యమంత్రి పేరును ఇరికించాలంటూ తనపై ఒత్తిడి పెరుగుతోందని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆమెపై ఇ.డి అసిస్టెంట్ డైరెక్టర్ ఒత్తిడి తెచ్చారని ఈ సందర్భంగా అక్కడే వున్న మహిళా కానిస్టేబుల్ నిర్ధారించారు.
పై స్థాయి నుండి ఆదేశాలు రాకపోతే దర్యాప్తు సంస్థలు ఇటువంటి నీచమైన ఎత్తుగడలు చేపట్టలేవు. రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకోవాలన్న బిజెపి ప్రభుత్వానికి ఇ.డి ఒక పావులా మారిపోయింది. ఇ.డి దర్యాప్తు చేస్తున్న లేదా అభియోగాలు మోపుతున్న ప్రతిపక్ష నేతల జాబితాలో మొత్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు వున్నాయి. వీరిలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్‌కి చెందిన భూపిందర్ హుడా, డి.కె.శివకుమార్, నేషనల్ కాన్ఫరెన్స్‌కి చెందిన ఫరూక్ అబ్దుల్లా, కాశ్మీర్ పిడిపి కి చెందిన మెహబూబా ముఫ్తి, రాష్ట్రీయ జనతాదళ్‌కి చెందిన తేజస్వి యాదవ్, మిసా భారతి తదితరులున్నారు. ఇ.డి ఈ విధంగా విచారణ జరిపిన ఇతరుల్లో టిఎంసి కి చెందిన ముకుల్ రారు, కాంగ్రెస్ కి చెందిన హిమంత బిశ్వా శర్మ వున్నారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వుండేందుకు శర్మ బిజెపిలో చేరిపోయారు.
ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర సంస్థల దర్యాప్తులు, చర్యలు వేగంగా జరగాలంటూ కేరళలోని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల మాత్రమే కాదు, రాహుల్ గాంధీ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా, రాహుల్ గాంధీ అండ్ కో బిజెపి ధోరణికి అనుకూలంగా వుండడమే కాదు, ఇతర రాష్ట్రాల్లో తమ నేతలపై ఇ.డి తీసుకున్న చర్యలను కూడా చట్టబద్ధం చేసినట్లే అవుతోంది.
ఆర్థిక మంత్రిత్వశాఖ లోని రెవిన్యూ విభాగం కింద పని చేసే ఇ.డి ఎలాంటి చట్టబద్ధమైన హద్దులు లేని సంస్థ లాగా పని చేస్తోంది. దీనికి ఎలాంటి చట్టబద్ధమైన మద్దతు లేదు. కానీ, దాడులు, సోదాలు, అరెస్టులు, ఆస్తుల జప్తు వంటి చర్యలు చేపట్టే విస్తృత అధికారాలు వున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ), ఫెమా కింద కేసుల దర్యాప్తు పేరుతో ఇవన్నీ చేస్తోంది.
ప్రస్తుతం ఇ.డి డైరెక్టర్‌గా వున్న సంజరు కుమార్ మిశ్రా ఆదాయ పన్ను మాజీ కమిషనర్. ఇ.డి డైరెక్టర్ పదవీ కాలం రెండేళ్ళు వుంటుంది. కానీ మిశ్రా విషయంలో, 2020 నవంబరు నుండి ఏడాదిపాటు పొడిగించారు. దీంతో ఆయన తన బాస్‌లు ఏం చెబితే అది అత్యంత వినయంతో చేయడానికి సిద్ధంగా వున్నారు. ఇ.డి చర్యలకు జవాబుదారీతనం వుండేలా చట్టపరమైన నిబంధనలు వుండాలని కేరళ అనుభవం మనకు చెబుతోంది.
బిజెపి, కాంగ్రెస్, కేంద్ర సంస్థల కుమ్మక్కుతో కేరళలో, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన బంగారం అక్రమ రవాణా, అవినీతి ఆరోపణలను ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారు. ఎల్‌డిఎఫ్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ప్రజలు ఈ దుష్ట త్రయానికి గట్టి ప్రతిఘటన ఇవ్వనున్నారు.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










