Nov 20,2022 00:12

కేన్సర్‌ జయించిన వనితలతో మేయర్‌ హరి వెంకట కుమారి

ప్రజాశక్తి - ఆరిలోవ : కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని అపోలో కేన్సర్‌ విభాగం వైద్యులు పేర్కొన్నారు. ఆరిలోవ హెల్త్‌సిటీలోని అపోలో ఆంకాలజీ విభాగంలో శనివారం విక్టోరియస్‌ వనితలతో 'కేన్సర్‌ సర్వవైవర్స్‌' అనే కార్యక్రమం చేపట్టారు. కేన్సర్‌తో పోరాడి జయించిన సుమారు 200 మంది వనితలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలన్నారు. అపోలో కేన్సర్‌ నిపుణులు డాక్టర్‌ సుమన్‌దాస్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ అడుసమిల్లి, డాక్టర్‌ రమేష్‌ అలమూర్తి, డాక్టర్‌ జయశ్రీ కూన, డాక్టర్‌ హేమంత్‌ వర్మలు వ్యాధిని గుర్తించడం, చికిత్సపై అవగాహన కల్పించారు. అనంతరం క్యాన్సర్‌ జయించిన విక్టోరస్‌ వినితలతో ఆటల పోటీలు, మిమిక్రీ, మ్యాజిక్‌ షో వంటి కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ శాంతమ్మ, అపోలో సిఇఒ జె.రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.