
ప్రజాశక్తి -గరుగుబిల్లి : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ఉల్లిభద్ర జంక్షన్ వద్ద సిపిఎం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ప్రజలలో అసమానవతలను సృష్టిస్తున్నాయని చెప్పారు. సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే విధంగా పాలకుల విధానాలు ఉన్నాయని విమర్శించారు. విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల నడ్డివిరిచారన్నారు. అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. సాగునీరు అందించక, రైతులు పండించే పంటలు కొనుగోలు చేయక వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను బిజెపి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజెపిని నిలదీయాల్సిన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రానికి దాసోహమై, రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధి సాధనకు సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగానే ఈ నెల 30న కురుపాంలో జరిగే బహిరంగ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొంటారని, ఈ సభకు ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం రవీంద్ర, బివి రమణ, దాసరి వెంకటనాయుడు, రెడ్డి సూర్యనారాయణ, బి.వెంకటి, ప్రసాద్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 30న పార్వతీపురంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ కోరారు. పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు మున్సిపల్ కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. మూడో వార్డులో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి, ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు బి.సూరిబాబు, పి.రాజశేఖర్, పి.శంకర్రావు, సిహెచ్ సింహాచలం, జి.గంగరాజు, ఎం.శివ, గౌరమ్మ, జయమ్మ, గౌతమి, కామేశ్వరి, కొండమ్మ, పండుబాబు, వెంకటరమణ, బలరాం తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : కురుపాంలో ఈ నెల 30న జరిగే ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి కోరారు. కొమరాడ మండల కేంద్రంలో మరడాన వీధిలో బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విక్రమపురం, అర్తం, శివిని, గంగరేగువలస, కోటిపాం, జంఝావతి సెంటర్‌లో ప్రచారం చేశారు. భవన కార్మికుల సంఘం నాయకులు యామక గౌరినాయుడు, ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.