Jul 28,2021 11:57

న్యూఢిల్లీ : పెగాసెస్‌ ఫోన్‌ హ్యాంకింగ్‌ కుంభకోణంలో కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని 14 విపక్ష పార్టీలు బుధవారం సమావేశమయ్యాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి పెగాసెస్‌, నూతన వ్యవసాయ చట్టాలపై విపక్షాల చేపడుతున్న నిరసనలతో చట్ట సభలు స్థంభించిపోతున్న సంగతి విదితమే. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన ఈ సమావేశంలో నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌, శివసేన, సిపిఐ, సిపిఎం, రాష్ట్రీయ జనతా దళ్‌, ఆప్‌, డిఎంకె, ముస్లిం లీగ్‌ నేతలు పాల్గన్నారు. వీటితో పాటు చిన్న పార్టీలైన రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, కేరళ కాంగ్రెస్‌, విడుతలై చిరుతైగల్‌ కచ్చి, సమాజ్‌వాదీ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. మొత్తం 14 విపక్షాల చెందిన నేతలంతా మధ్యాహ్నం 12.30 గంటలకు ఉమ్మడి ప్రకటన చేయనున్నారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్‌ సరిగ్గా నడవన్విడం లేదంటూ ప్రధాని మోడీ ఆరోపించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ తొమ్మిది సార్లు వాయిదా పడటంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా సభను సాగనివ్వకుండా చేస్తోందని ప్రధాని మండిపడ్డారు.
పెగాసెస్‌, నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాయి. ఆ తర్వాత ఈ సమావేశం జరిగింది. లేఖ రాసిన వారిలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ, అకాలీదళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపిలు ఉన్నాయి. కాగా, ఇందులో కాంగ్రెస్‌ భాగస్వామ్యం కాలేదు. కాగా, పెగాసెస్‌ సమస్యపై చర్చించాలని ప్రతిపక్షాలు చేసిన ఐక్య డిమాండ్‌ను అంగీకరించకపోవడం వల్లే పార్లమెంట్‌ సజావుగా సాగడం లేదని..ఇందుకు కేంద్రమే కారణమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.