Nov 10,2023 00:26

తెనాలిలో స్వాగతం పలుకుతున్న శ్రేణులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, కేంద్రంలో బిజెపి ఓటమే లక్ష్యంగా కృషి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో మరింతగా ఉద్యమిస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్‌ అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సిపిఎం ఉద్యమాల్లో ప్రజలు కలిసి రావాలని, అందులో భాగంగా ఈనెల 15న విజయవాడలో నిర్వహించే ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజారక్షణ భేరి జాతా గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించింది. తెనాలి నుండి గుంటూరు, పెదకాకాని, మంగళగిరి మండలం కాజ, మంగళగిరి పట్టణం, తాడేపల్లి మీదుగా సాగి ముగిసింది. ఈ సందర్భంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఆయా సభల్లో గఫూర్‌ మాట్లాడుతూ కేంద్రంలో మానవత్వం లేని, రాక్షస ప్రభుత్వం అధికారంలో ఉందని, స్వాతంత్య్రం వచ్చాక ఎన్నడూ లేనంతగా మైనార్టీలపై ఊచకోతకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. పాలస్తీనా భూభాగం పాలస్తీనియులదేనని మహాత్మా గాంధీ కూడా చెప్పారని, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతు పలకటం శోచనీయమని అన్నారు. ఇప్పటికే 10 వేల మంది పాలస్తీనియులు చనిపోయారని, వారిలో 4500 మంది పిల్లలు, మహిళలున్నారని తెలిపారు. తక్షణమే పాలస్తీనాకు భారత ప్రభుత్వం సంఘీభావం తెలపాలన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మోడీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులు, రైల్వే, బొగ్గు గనులు, విమానయానం, బీమా తదితర పరిశ్రమలను హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయిస్తే లాభాలు తెచ్చి చూపిస్తామని కార్మికులు చెబుతున్నా కేంద్రం మాత్రం టాటా, జిందాల్‌ వంటి కార్పొరేట్లకు గనులు కేటాయిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మొండిచేయి చూపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం 103 మండలాలే ప్రకటించటం సరికాదన్నారు. ప్రకటించిన మండలాల్లోనూ రైతులకు భరోసా ఏమీ లేదన్నారు. బిజెపితో కలిసి జగన్‌ మూడు రాజధానుల నాటకం అడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను వదిలేసి ఇసుక, మట్టి అమ్ముకునే పనిలో, భూ కజ్జాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. సమస్యలపై నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా, నోరెత్తితే జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. తాము పులులు, సింహాలు అంటూ అధికార, ప్రతిపక్షాలు కీర్తికించుకుంటున్నాయని, కానీ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న మోడీ ముందు పిల్లులుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందనే ప్రచారం ఆ పార్టీలోనూ ప్రచారం అవుతోందని, అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన చంద్రబాబు బిజెపికి కృతజ్ఞతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వైసిపి పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని, అయితే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరింది మాత్రం రూ.రెండున్నర లక్షల కోట్లేనని, మిగతా డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తేల్చాల్సిన సమయం వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి జాబితాలలో గణనీయమైన అవకతవకలు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు, మున్సిపల్‌, పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు అందటం లేదన్నారు. నెలల తరబడి జీతాలు చెల్లించకుంటే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. కేంద్రం ద్వారా పంచాయతీలకు విడుదలయ్యే నిధులనూ దారి మళ్లిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి కరువై లక్షల మంది వలసెళ్తున్నారని, సాగునీరు అందక ఎండిపోయిన పొలాలు, నిస్సహాయంగా ఉన్న ఆర్పీకే వ్యవస్థను తాము గమనించామని చెప్పారు. నిరుద్యోగం తాండవిస్తోందని, బిటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ చదివిన వారు కూడా ఆటోలు నడుపుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివద్ధి పరిశ్రమల తోనే సాధ్యమని, అవి రావాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బిసిలు ఎవరికీ రక్షణ లేదన్నారు. రాష్ట్రానికి ఏం చేశారని బిజెపి మద్దతివ్వాలో పవన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలను ద్రోహం చేసిన వైసిపి, టిడిపి, జనసేనలను ఓడించాలన్నారు. సర్‌ ఛార్జీల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచి మోడీ ఆడమన్నట్లు ఆడుతున్న వైసిపి విధానాలు రాష్ట్రానికి అవసరంలేదన్నారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వమని విమర్శించారు. సిఎం వాడుతున్న బాత్‌రూమ్‌ ఖరీదు రూ.26 లక్షలు అయితే పేదల ఇంటికి రూ.1.80 లక్షలు ఎలా సరిపోతాయన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కొరవడిందని అన్నారు. 400 ప్రాజెక్టులకు పునాది రాళ్లు అంతే ఉన్నాయని, రిజర్వాయర్లలో నీరున్నా వాటిని ఉపయోగించే ప్రణాళికలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 28 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని తెలిపారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు రావాల్సి ఉన్నా వాటి గురించి, వైసిపి, టిడిపి నోరుమెదపట్లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనటానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా కుట్ర చేస్తున్నాయన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకే అచ్చేదిన్‌ వచ్చిందని, అదాని ఆస్తులు రూ.10వేల కోట్ల నుండి రూ.లక్ష కోట్లకు చేరడం ఇందుకు ఉదాహరణని అన్నారు. అయినా బడా బాబులకు పన్ను రాయితీలు ఇస్తున్నారని, తొమ్మిదేళ్లలో రూ.12 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికుల సర్వీస్లను క్రమబద్ధీకరణ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపుదల, సిపిఎస్‌ రద్దు తదితర హమీలను జగన్‌ విస్మరించారన్నారు. సామాజిక న్యాయం అంటూ వైసిపి చేస్తున్న ప్రజా సాధికార యాత్ర అసత్యాల పుట్టని, రాష్ట్రంలో రెండున్నర లక్షల పోస్టులు భర్తీ కాలేదని, వాటిలో 65 వేల పోస్టులు ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సినవేన చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దయా రమాదేవి మాట్లాడుతూ కార్మికులకు, పేదలకు నష్టం చేకూర్చే చట్టాలను కేంద్రం తెస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయని, పంటలకు మద్దతు ధరలు దక్కడం లేదని అన్నారు. కాజా గ్రామంలో 400 ఎకరాలలో కూరగాయలు పంటలు పండిస్తుంటే కనీస మద్దతు ధర దక్కడం లేదని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్నీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ దేశంలో నల్లధనాన్ని వెలికితీసి జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ ఏమైందన్నారు. గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేశారని, రైల్వేలో సీనియర్‌ సిటిజన్స్‌కు రాయితీ ఎత్తివేశారని విమర్శించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీనిచ్చి వాస్తవంలో 18 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. విపరీతంగా పెరుగుతున్న నిత్యవసరాల ధరలను అదుపు చేయడం లేదని అన్నారు. మైనారిటీలపై దాడులు పెరిగిగాయని, గుజరాత్‌లో ముస్లిములపైన, మణిపూర్లో క్రైస్తవులపైన దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తోందని, భవిష్యత్‌లో కమ్యూనిస్టులపైనా దాడులకు తెగబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ చట్టాన్ని రాష్ట్రంలో అమలుకు వైసిపి ప్రభుత్వం పూనుకుందని, ఫలితంగా విద్యుత్‌ ఛార్జీలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను దూరం చేస్తోందన్నారు. ప్రభుత్వ తీరుతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అయోమయంలో ఉన్నారని, ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని సిపిఎం డిమాండ్‌ చేస్తుందని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలకు రూ.5 లక్షలు కేటాయించాలన్నారు. దాదాపు లక్ష కుటుంబాలు ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో తలదాచుకుంటున్నాయని, వాటిని క్రమబద్ధీకరించి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. దళితుల శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని, గతంలో పల్లపు ప్రాంతాలలో ఇచ్చిన నివేశన స్థలాలకు ప్రభుత్వమే మెరకలు తోలించాలని కోరారు. పెదవడ్లపూడి హై లెవెల్‌ ఛానల్‌కు రూ.రెండు కోట్లు మంజూరు చేసి సాగునీటి సమస్యకు చెక్‌ పెట్టాలని, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు విస్తరింపజేసి సాగునీటికి ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. మంగళగిరి ప్రాంతంలో అపార్టుమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో డ్రెయినేజీ వ్యవస్థ పటిష్టతకు చర్యలు చేపట్టాలని, లేకుంటే పంట కాల్వలు మురికి కాల్వలుగా మారి పొలాలన్ని దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు.