కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అండర్ కార్యదర్శి సుశీల్ బడింగ్
ప్రజాశక్తి - రంపచోడవరం
ఏజెన్సీలోని కొండరెడ్డి కులస్తులకు సంబంధించిన సమస్యలపై నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ సుశీల్ బడింగ్ పేర్కొన్నారు. మండలంలోని చిలక మామిడి గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద కొండరెడ్డి పివిటిజి కులస్తులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేసి రోడ్లు ఏర్పాటు చేయాలని, తమ గ్రామానికి ఆనుకొని ఉన్న కాలువపై వంతెన నిర్మించాలని, 300 ఎకరాలకు సాగునీరు అదేవిధంగా వ్యవసాయ బోరులు, కరెంటు మోటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రంపచోడవరం నుండి తమ గ్రామానికి రహదారి పనులు పూర్తి చేసి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, సబ్సిడీపై ట్రాక్టర్లు మంజూరు చేయాలని, మహిళలకు ఉపాధి కలిగించే విధంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని, ప్రతి ఇంటికి పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పించాలని, గ్రామంలోని 8 వీధులకు సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కొబ్బరి పీచు యూనిట్ ఏర్పాటు చేయాలని, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం పక్కాగా అమలు చేయాలని, భూపతిపాలెం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు రెండు ఎకరాల చొప్పున సాగు భూమి ఇవ్వాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లకు నిధులు పెంచాలని, జీసీసీ ద్వారా జీడిపిక్కలు కొనుగోలు చేయాలని కోరారు.
అనంతరం సునీల్ బడింగ్ మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 75, ఆంధ్రలో 9 పివిటిజి తెగలు ఉన్నాయని, వెనకబడి ఉన్న ఈ తెగలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రపతి ఆదేశాల మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ జనరల్ మేనేజర్ మణికుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని మన హక్కులను మనమే కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో సిహెచ్.శ్రీనివాసరావు, తహశీల్దారు పివివి. జయసూర్య కుమార్, ఎంపీడీవో హరికృష్ణ, సర్పంచ్ పల్లాల ఆదిలక్ష్మి, డీఈలు ఎ.వెంకటేశ్వరరావు, రాజేంద్ర బాబు, ఏఈలు పి.వెంకటరమణ, శ్రీనివాస్, భీమశంకర్, రాజు, ఏపిఎం అప్పారావు, ఉపాధి హామీ ఏపీవో సాయిబాబా, వైటిసి మేనేజర్ సుధీష్, గ్రామ పెద్దలు పల్లాల లచ్చిరెడ్డి, ఒంటుకుల కృష్ణారెడ్డి, ఒంటికుల ఆదిరెడ్డి పాల్గొన్నారు










