Jun 15,2021 06:57

   ప్రభుత్వరంగం కాలక్రమంలో కూడబెట్టిన ప్రజాసంపదను చేతికి ఎముక లేకుండా కార్పొరేట్లకు దోచిపెట్టడమే ధ్యేయంగా పని చేస్తున్న మోడీ ప్రభుత్వ చర్యల్లో విద్యుత్‌ 'సంస్కరణ'లు పరాకాష్ట వంటివి. తాము దోచిపెట్టడమే గాక రాష్ట్రాలను సైతం అదే బాటలో నడవాలని ఒత్తిడి తెస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కామ్‌)ను ప్రైవేటీకరిస్తే రాష్ట్రాలకు అదనపు రుణం తీసుకునే అవకాశం కల్పిస్తామని కేంద్రం షరతు విధించడం దారుణం. మాంద్యం, కరోనా విలయం, కేంద్ర సహాయ నిరాకరణలతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నాయి. విభజన నేపథ్యంలో మన రాష్ట్రం మరింతగా ఆర్థికంగా అవస్థలు పడుతోంది. సరిగ్గా ఈ విపత్కర సమయాన విద్యుత్‌ సంస్కరణలు చేయమని కేంద్రం బ్లాక్‌మెయిల్‌ చేయడం ఘోరం. రాష్ట్రాలపై కేంద్ర బలవంతపు పెత్తనం రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. రాష్ట్రాలు తమ స్థూలోత్పత్తి (జిఎస్‌డిపి)లో 0.5 శాతం అదనంగా అప్పు చేయాలనుకుంటే తప్పనిసరిగా తాము ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు అమలు పర్చాలని కేంద్రం లేఖలు రాసిన విషయం గుప్పుమంది. కేంద్రం అమలు చేయమంటున్న అంశాలు అత్యంత ప్రమాదకరమైనవి, ప్రజా వ్యతిరేకమైనవి. డిస్కామ్‌ల అమ్మకం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, వినియోగదారుల రాయితీల నగదు బదిలీ, పరిశ్రమలకు కారుచవకగా విద్యుత్‌ సరఫరా వంటి కండిషన్లు కొన్ని మాత్రమే. సంస్కరణలకు ఐదేళ్ల కాలపరిమితి, ఏ సమయానికి ఏమేమి చేయాలనే పకడ్బందీ షెడ్యూలు, ఆనక బోనస్‌, సాధారణ మార్కులూనూ. ప్రైవేటీకరణ తంతు, విధాన రూపకల్పనపై బహిరంగ ప్రకటనకు బోనస్‌ మార్కులు. మొత్తంగా ఉచిత విద్యుత్‌ ఎత్తేస్తే అదనపు బోనస్‌ పాయింట్లు. ఇంకా వినాశకరమైన అంశాలు కేంద్ర ప్రతిపాదనల్లో ఎన్నో ఉన్నాయి.
   దేశంలో కోవిడ్‌ తొలిదశ వేళ బిజెపి ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు చేయగా, వాటితోపాటే ప్రజాకంటక విద్యుత్‌ సంస్కరణల సవరణ బిల్లునూ తెరమీదికి తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతాంగం ఆర్నెల్లకు పైగా అప్రతిహతంగా ఉద్యమం చేస్తోంది. చర్చల సందర్భంగా విద్యుత్‌ బిల్లును తాత్కాలికంగా వాయిదా వేస్తామని కేంద్రం చెప్పి, అంతలోనే దొడ్డిదారిలో సంస్కరణల అమలు కోసం రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం దాని కార్పొరేట్‌ అనుకూల మనస్తత్వాన్ని తెలుపుతుంది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోవిడ్‌ అవస్థలు అదనం. సమస్యల అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న అన్నదాతలకు అరకొరగా ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలనడం రైతుల పట్ల బిజెపి ప్రభుత్వ కర్కశానికి నిదర్శనం. ఎస్‌.సి, ఎస్‌.టి, ఇతర బలహీన వర్గాలకు ఇప్పటి వరకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీని స్మార్ట్‌ మీటర్లతో యూనిట్లను కొలిచి నగదు బదిలీ చేయమనడం ఏ విధమైన సామాజిక న్యాయమో, ఏ రకంగా బడుగు బలహీనవర్గాల ఉద్ధరణో కేంద్రమే చెప్పాలి. అటు తిప్పి ఇటు తిప్పి మోడీ సర్కారు చెప్పేదేమంటే ఒక వైపు విద్యుత్‌ రంగాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం మరో వైపు ప్రజలకు సబ్సిడీలను ఎత్తేయడం.
   కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే ఎ.పికి వచ్చే అదనపు రుణం రూ.ఐదు వేల కోట్లు. ఆ మాత్రం దానికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆడమన్నట్లు ఆడితే ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. సామాజిక భద్రత దెబ్బతింటుంది. దశాబ్దాలుగా సంపాదించిన రూ.లక్షల కోట్ల డిస్కామ్‌ల ఆస్తులు అప్పనంగా కార్పొరేట్ల వశమవుతాయి. లాభదాయకమైన ఏరియాలనే ప్రైవేటు వారు తీసుకోవడం వ్యాపార సూత్రం. నష్టదాయక ప్రాంతాలకు విద్యుత్‌ సేవలు అందక నిరాదరణకు గురవుతాయి. ఇప్పటికే పవర్‌ పర్చేజి అగ్రిమెంట్ల(పిపిఎ)తో ప్రైవేటు ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రభుత్వాలు వాటికి అనుకూలంగా వ్యవహరించి డిస్కామ్‌లను నష్టాల్లో ముంచాయి. ఆ నష్టాలను చూపించి ఏకంగా వాటిని అమ్మేయమంటోంది కేంద్రం. కేంద్ర ఒత్తిడికి రాష్ట్రం తలొగ్గకుండా సంస్కరణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. రాష్ట్ర హక్కులు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ఇతర రాష్ట్రాలతో కలిసి కేంద్రంపై పోరాడాలి. కేంద్రం ఇచ్చే మార్కుల కోసమో, అదనపు అప్పు కోసమో ప్రజాప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తే రేపు ప్రజలు మార్కులు వేయరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలి.