Jul 26,2023 22:11

ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనులు

- మణిపూర్‌ సిఎం రాజీనామా చేయాలి
- ఎఐఎఇఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్నాయకులు
ప్రజాశక్తి - పలాస, మెళియాపుట్టి: 
మణిపూర్‌లో ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సవర జగన్నాయకులు డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో ఘటనలకు బాధ్యులను శిక్షించాలని, శాంతిని నెలకొల్పాలని పలాస జూనియర్‌ కళాశాల నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్‌లోని ఆదివాసీలకు రక్షణ కల్పించాలని, మహిళలను నగంగా ఊరేగించిన, హత్యాచారం చేసిన దుండగులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. 80 రోజులుగా విధ్వంసాలు, మారణకాండతో మణిపూర్‌ ప్రజలు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యంత హేయమైనవన్నారు. మూడు నెలలుగా అక్కడ ఘర్షణలు జరగుతున్నా, వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రపంచ దేశాలు మణిపూర్‌ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా, బిజెపి మహిళా ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎఐఎఇఎఫ్‌ మండల అధ్యక్షులు పి.ఈశ్వరరావు, ఆదివాసీ వికాస పరిషత్‌ కార్యవర్గ సభ్యులు సవర విజరు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ మదన్‌మోహన్‌, కౌన్సిలర్‌ సవర సోమేశ్వరరావు, గిరిజన నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మెళియాపుట్టి మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలి కూడలి నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు గిరిజనులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల కృష్ణారావు, ఆదివాసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు సవర చొక్కారావు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్‌.కిరణ్‌, సహాయ కూర్మారావు విద్యార్థులు, యువత పాల్గొన్నారు.