ప్రజాశక్తి - ఆరిలోవ : విశాఖ కేంద్రకారాగారంలో 'స్టేక్ హోల్డర్స్ కో-ఆర్డినేషన్ అండ్ లీడర్ షిప్' అంశంపై జైళ్ళశాఖ అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సు బుధవారంతో ముగిసింది. ముగింపు సదస్సుకు ఇండియన్ నేవీ రిటైర్డ్ అడ్మిరల్ టి.సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘంచిన నేరస్తులు ఉన్న జైళ్ళశాఖలో ఉద్యోగం చేయడం సాధారణ విషయం కాదన్నారు. దానికి ఎంతో నైపుణ్యం ఉండాలన్నారు. జైల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగీ ఒక లీడర్ అన్నారు. నేరస్తులను క్రమ శిక్షణలో పెట్టి వారిలో మార్పు తీసుకు రావడానికి నిరంతరం కృషి చేస్తూ తద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం జైళ్ళ శాఖ ఐజి డాక్టర్ ఇండ్ల శ్రీనివాసరావు, ముఖ్యఅతిథి టి.సుధాకర్‌తో కలిసి సదస్సులో పాల్గొన్న అధికారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్రకారాగరాం పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.










