Nov 01,2023 22:31

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ : ప్రతిష్టాత్మక జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఎంపికయ్యారని విద్యాలయ ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌ హుస్సేన్‌ తెలిపారు. స్థానిక కేంద్రీయ విద్యాలయ లో బుధవారం విజేతలను ఆయన అభినందించారు. విశాఖపట్నం శ్రీ విజయనగర్‌ కేంద్రీయ విద్యాలయ 1 లో అక్టోబర్‌ 31వ తేదీన జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రాంతీయ స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలలో పాఠశాల ఏడో తరగతి విద్యార్థులు ఆర్‌. హర్షిత, పి రితికలు సైన్స్‌ ఉపాధ్యాయిని కే సాహిత్య పర్యవేక్షణలో విద్యార్థుల్లో చరవాణి వాడకం తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుటకు, పెరట్లో సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తుల పెంపకం అనే అంశంపై చేసిన ప్రాజెక్టును జాతీయస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ కు ఎంపిక చేశారు. దీంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులను ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.