Apr 21,2023 22:52

టిడ్కో నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడు?
మెప్మాలో వసూళ్ల దందాపై చర్యలేవీ?
వాడీవేడిగా కౌన్సిల్‌ సమావేశం
ప్రజాశక్తి - నూజివీడు

              కేంద్రీయ విద్యాలయం ఎప్పుడు ప్రారంభమవుతుందని, టిడ్కో ఇళ్లు ఇంకెప్పుడు ఇస్తారని టిడిపి కౌన్సిలర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికార వైసిపి కౌన్సిలర్లు సతమతమయ్యారు. నూజివీడు మున్సిపల్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ త్రివేణిదుర్గ అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా జరిగింది. ఎజెండా, టేబుల్‌ అజెండాకి చెందిన పలు అంశాలను డిఇఇ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బంది చదివి సభ్యులకు వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న సమావేశ మందిరంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. సెంట్రల్‌ ఎసిలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పగడాల సత్యనారాయణ ప్రతిపాదనలపై మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్‌ అభ్యంతరం చెప్పారు. సెంట్రల్‌ ఎసిల స్థానంలో గతంలో పాత సమావేశ మందిరానికి సంబంధించిన ఎసిలను అమర్చాలని కౌన్సిల్‌లో తీర్మానించారు. ఎంప్లాయిస్‌ కాలనీలో మున్సిపల్‌ నిధులు రూ.90 లక్షలతో ఏర్పాటు చేసిన కేంద్రీయ తాత్కాలిక భవనాలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయని, అసలు కేంద్రీయ విద్యాలయానికి అనుమతి ఉందా, లేదా అని ఫ్లోర్‌లీడర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్‌ ప్రశ్నించారు. దీనిపై కో-ఆప్షన్‌ సభ్యుడు రామిశెట్టి మురళీకృష్ణకుమార్‌ స్పందిస్తూ అనుమతి రాకుండా ఆబ్జర్వర్లు ఎలా వస్తారన్నారు. కేంద్రీయ శాశ్వత భవనాల నిర్మాణానికి ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఏడు ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయం నూజివీడులో అడ్మిషన్లు ఈ ఏడాది ఉంటాయని అనుకుం టున్నట్లు ఆయన వివరించారు. ఫ్లోర్‌లీడర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ టిడిపి హయాంలో ప్రారంభమైన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు నాలుగేళ్లు అయినా పూర్తవ్వలేదని, ఆ నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ టిడ్కో నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయని, నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఫేజ్‌-2 కింద నూజివీడు ఎంపికవ్వడంతో నిర్మాణాలు జాప్యం జరుగుతున్నాయన్నారు. జులై నుంచి ఫేజ్‌-2 పనులు ప్రారంభమవుతాయని, అప్పుడు గృహ నిర్మాణ పనులతో పాటు రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను కూడా టేబుల్‌ అజెండాలో పెట్టడం పట్ల టిడిపి కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసరా అమలులో పలు అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ సమావేశంలో కో-ఆప్షన్‌ సభ్యుడు ప్రసాదరావు, మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.