ప్రజాశక్తి -కంచరపాలెం : కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నిర్ణయించిన పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంచరపాలెంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు ఒక పోస్టుకు రూ.2,300 పరీక్ష ఫీజు పెట్టడం దారుణమన్నారు. పరీక్ష నిర్వహణ పేరిట భారీ ఎత్తున ఫీజు వసూలుచేయడం నిరుద్యోగులను లూటీ చేయటమేనని విమర్శించారు. ఉద్యోగ అభ్యర్థులు ఫీజు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 4, 5 రకాల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే రూ.10 వేలకు పైగా ఫీజు చెల్లించాలని, ఇది పేదలకు మోయలేని భారం అని పేర్కొన్నారు. వెంటనే ఈ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పి.విజయ, జోన్ కార్యదర్శి ఎస్.శ్రావణ్ కుమార్, శరత్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు బి.మురళి, పి.రాజశేఖర్ పాల్గొన్నారు.










