Nov 16,2023 21:19

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న టిడిపి,జనసేన నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన హామీలు అమలు చేయక పోయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం వైసిపికి లేదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌ గజపతిరాజు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో టిడిపి, వైసిపి సమన్వయసమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాన్ని అశోక్‌గజపతిరాజు, జనసేన రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశ్వస్విని ఆవిష్కరించారు. అనంతరం అశోక్‌ మాట్లాడుతూ భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు రానున్న రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు ఉన్నారా లేరా అనే సందేహం కలుగుతోందన్నారు. వైసిపి ప్రభుత్వం వెన్నుముక లేకుండా ఉందన్నారు. చంద్రబాబును ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రజాధనాన్ని మింగేసి జైలుకు వెళ్లిన దొంగ నేడు పాలన చేస్తున్నారన్నారు. అలాంటివారికి బెదిరింపుల మనస్తత్వం కాకుండా ఇంకా ఏమి ఉంటుందన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుండి రావాల్సిన హక్కులు కోసం పదవులు కూడా వదులుకున్నామన్నారు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వేరే వాటికి బదిలీ చేసి ఆ లబ్ధిదారులకు అన్యాయం చేస్తుందన్నారు. యశస్విని మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఒక్కప్పుడు ప్రశాంతంగా ఉండే విజయనగరం నేడు అనేక సమస్యలతో సతమతమవుతోందన్నారు. మళ్లీ దొంగను ప్రోత్సహిస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కనకల మురళీమోహన్‌, బంగారు బాబు, జనసేన నాయకులు జి.శాంతి,రౌతు సతీష్‌ పాల్గొన్నారు.