కేంద్ర విద్యాసంస్థల్లో సామాజిక న్యాయం ఎక్కడ..?.. మిగిలిపోతున్న ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల సీట్లు

- డ్రాపౌట్లలోనూ వారే అధికం
- తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
న్యూఢిల్లీ : ఐఐటిలు, ఎన్‌ఐటిలతోపాటు పలు ఇతర కేంద్ర సాంకేతిక విద్యా సంస్థల్లో (సిఎఫ్‌టిఐ) సామాజిక న్యాయం కొరవడింది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థులకు రిజర్వ్ చేసిన సీట్లు గత కొన్నేళ్లుగా మిగిలిపోతున్నాయి. డ్రాపౌట్ల విషయంలోనూ వారే అధికంగా ఉండడం ఆందోళకరమని, దీన్ని పరిష్కరించేం దుకు కేంద్రం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు విపి.సాను, ప్రధాన కార్యదర్శి మయూష్ బిశ్వాస్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సిపిఎం ఎంపి వి.శివదాసన్ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2016-2020కు సంబంధించి కేంద్ర సాంకేతిక విద్యాసంస్థల్లో 683 ఎస్‌సి సీట్లు, 831 ఎస్‌టి సీట్లు, 591 ఒబిసి సీట్లు భర్తీకి నోచుకోలేదు. భర్తీ కాని సీట్లలో ఐఐటి, ఎన్‌ఐటిలు, ఐఐఎస్‌ఇఆర్‌లు అధిక వాటా కలిగివున్నాయి. 619 మంది ఎస్‌సి విద్యార్థులు, 365 మంది ఎస్‌టి విద్యార్థులు, 847 ఒబిసి విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారు. టాప్ ఏడు ఐఐటిల్లోని అండర్ గ్రాడ్యుయేట్ డ్రాపౌట్లలో 63 శాతం రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారివే కాగా, అందులో కూడా 40 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులే ఉన్నారు. ఉత్తరాఖండ్, వరంగల్, కాలికట్ ఎన్‌ఐటిల్లో డ్రాపౌట్లలో ఎస్‌సి, ఎస్‌టిలవి కలిపి వరుసగా 50, 40, 30 శాతం ఉండగా, ఆయా సంస్థల్లో వారి అడ్మిషన్ల శాతం కూడా 24, 23, 20 శాతం మాత్రమే ఉంది. ఐఐటిలతోపాటు ఇతర సిఎఫ్‌ఐటిల్లో పిహెచ్‌డి, ఎంఎస్ అడ్మిషన్లలో చోటుచేసుకుంటున్న రిజర్వేషన్ల ఉల్లంఘనను ఇప్పటికే లేవనెత్తామని, ఈ అంశం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుందని తెలిపారు. సిఇఐ (అడ్మిషన్లలో రిజర్వేషన్లు) చట్టం-2006ను సక్రమంగా అమలు చేయాలన్న డిమాండును పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు. ఈ చట్టం ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు వరుసగా 15, 7.5, 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక సెల్‌ల ఏర్పాటును తప్పనిసరి చేస్తుంది.