Aug 30,2023 22:51

ప్రజాశక్తి-యంత్రాంగం కేంద్ర బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిరుద్యోగం అధిక ధరలు విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం సమరభేరి మోగించింది. జిల్లావ్యాప్తంగా బుధవారం పార్టీ ఆధ్వర్యాన ఆందోళనలు చేపట్టారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. కాకినాడ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి సిపిఎం సమరభేరి ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 60ఉన్న పెట్రోల్‌ ధర రూ.112 అయ్యిందని, రూ. 400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200కు చేరిందని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకు తగిన విధంగా ప్రజల ఆదాయాలు పెరగలేదన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికి ఆచరణలో ఉన్న ఉపాధి కూడా లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వివిధ రూపాల్లో భారీగా విద్యుత్‌ ఛార్జీలు పెంచివేస్తోందనాన్రు. ఈ నేపథ్యంలో సిపిఎం సమరభేరి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, సంతకాలు చేయాలని కోరారు. సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1న సచివాలయాల్లో వినతి పత్రాలు సమర్పిస్తామని, 3న సుందరయ్య భవన్‌లో నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, 4న కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, దుంపల ప్రసాద్‌, నాయకులు చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకట రమణ, పాలిక రాజేంద్రప్రసాద్‌, పెండెం సూర్యారావు, రాణి, విజరు, రాజు, సాయి, వీరబాబు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక మెయిన్‌ రోడ్డు వినాయకుడి గుడి సెంటర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్‌ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బుడత రవీంద్ర సంతకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గూనూరు వెంకటరమణ, సిపిఎం నాయకులు గరగపాటి పెంటయ్య, యాసలపు రమేష్‌, కూనిరెడ్డి అప్పన్న, కేదారి నాగు, రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, డి.క్రాంతి కుమార్‌, చల్లా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు సిపిఎం తుని మండల కార్యదర్శి నక్కల శ్రీనివాస ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. తుని గొల్లప్రోలు సెంటర్‌, రామా టాకీస్‌, గర్ల్స్‌ హైస్కూల్‌ ప్రధాన కోడలిలో ప్రజలు, విద్యార్థులకు, వస్త్ర దుకాణస్తులకు విస్తతంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, సాక్షి రమేష్‌, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు సమరభేరి పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి సిపిఎం పార్టీ మండల కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వర రావు ఆవిష్కరించారు. అనంతరం ప్రజాసంఘాల భవనం వద్ద నుంచి పార్టీ పార్టీ జెండాలు చేతబూని తాళ్ళరేవు గ్రామంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.తణుకు రాజు, ఎన్‌.త్రిమూర్తులు, పి.సింహాచలం, సత్యనారాయణ, దడాల అబ్బులు, సంతోష్‌ కుమార్‌, నేల అన్నవరం, సుబ్బరాజు, ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కరప మండలం గొర్రిపూడి, గురజనాపల్లిలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాదం మోడీ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో, ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యిందన్నారు. కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందన్నారు.