Nov 13,2023 20:34

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి జకరయ్య

  కడప ప్రజల సంక్షేమం, అభివద్ధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్రంలోని బిజెపి , రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు రెండూ పూర్తిగా విఫలం చెందాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి జకరయ్య, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఏ. సత్తార్‌ ఘాటుగా విమర్శించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో తిరిగి పూర్వ వైభవం రాబోతుందని అన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాలు, 2024లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులు, పేదలు, అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. దీన్ని ప్రజలు ఇప్పుడు పూర్తిగా నమ్మి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచి ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. మద్యం ధరలు రెండంతలు పెంచి పెనుభారం మోపారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి దాసోహమై రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకురాలేకపోయరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని తప్పక నెరవేరుస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి దేశ ప్రజలందరినీ మోసం చేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాలను, మతాలను, ప్రాంతాలను విభజించి మోడీ ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సమావేశంలో హరిప్రసాద్‌, కదిరి ప్రసాద్‌, రత్నం పాల్గొన్నారు.