ప్రజాశక్తి-యంత్రాంగం:అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ భారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సిపిఎం సమర భేరి పలు గ్రామాల్లో కొనసాగింది. ఆ పార్టీ నేతలు సచివాలయాల్లో సిబ్బందికి వినతిపత్రాలు అందజేశారు.
ముంచింగిపుట్టు:స్థానిక వారపు సంతలో సిపిఎం సమరభేరిలో భాగంగా ఆ పార్టీ నేతలు సంతలో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిలో.సురేంద్ర మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం గత 9 నెలల నుండి రేషన్ బియ్యం నిలిపి వేయడంతో మండలంలో 46 డిపోల పరిధిలోని 15,200 కార్డు దారులు బియ్యం కొనుక్కోలేని పరిస్థితి నెలకొందన్నారు. నెలకు 350 మెట్రిక్ టన్నులు కాగా, 9 నెలలకు 3150 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం నిలిపివేయడంతో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. రేషన్ బియ్యం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటి సభ్యులు, లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాధ్ మాట్లాడుతూ, ప్రజలందరికీ అంతోదయ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటి సభ్యులు జీ.నారాయణ, కే.శంకర్రావు, కె.నర్సయ్య,వి, లైకోన్, డోంబ్రు పాల్గొన్నారు.
అనంతగిరి:మండలంలోని ఎగువ శోభ పంచాయతీ కేంద్రంలో సిపిఎం నేతలు పర్యటించి సంతకల సేకరణ చేపట్టారు. పార్టీ మండల కమిటీ సభ్యులు జన్ని సుబ్బారావు, సీపీఎం రాష్ట్ర నాయకులు ధడాల. సుబ్బారావు, టోకూరు సీపీఎం సర్పంచ్ కిల్లో. మోస్యలు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. ఎగువశోభ గ్రామ సచివాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసా ఉపాధ్యక్షులు నగేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
పివిటిజిల సమస్యలపై నిర్లక్ష్యం
పాడేరు:అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని పివిటిజి గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి అంత్యోదయ కార్డులు, గృహాలు మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాలికి లక్కు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని వంట్ల మామిడి మోదపల్లి పంచాయితీల పరిధిలో నంది గరువు, ఓనూరు గుర్రగరువు, తదితర పిటిజి గ్రామాల్లో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పివిటిజిలు సమస్యలత అవస్థలు పడుతున్నారని తెలిపారు. వంట్లమామిడి పంచాయతీలో 676 కుటుంబాలు ఉండగా 500 కుటుంబాలు పివిటిజి కుటుంబాలే ఉన్నాయన్నారు. ఇందులో 250 మందికి మాత్రమే 35 కేజీల బియ్యం కార్డులు ఉన్నాయని తెలిపారు.మోదపల్లి పంచాయతీలో 98 శాతం పివిటిజి గ్రామాలు ఉన్నాయని, 250 కుటుంబాలు ఉంటే కేవలం 150 కుటుంబాలకు మాత్రమే అంత్యోదయ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సతీష్, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు .
సచివాలయాల్లో వినతులు
డుంబ్రిగుడ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండలంలోని కించమండ, ఖండ్రుమ్, గుంటసీమ పంచాయితీ సచివాలయాల్లో శనివారం సిపిఎం నాయకులు నిరసన చేపట్టి సచివాలయ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పి డొంబు ,రాంజీ, మోహన్ దాస్, బి కోటి బాబు, కే.రామచందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ :బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసి స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని సిపిఎం డిమాండ్ చేసింది. మాదల గ్రామ సచివాలయం ముందు నిరసన చేపట్టి వినతి పత్రాన్ని సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు పాంగి రామన్న సచివాలయ సెక్రటరీకి అందించారు.జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదల పంచాయతీ నాయకులు అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల మండలంలో. గేమ్మేలి సచివాలయం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నాయకులు సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వనుగు సన్యాసిదొర, వంజారి పిన్నంనాయుడు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో శతశాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలన్నారు. చిన్న కొత్తూరు గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సలుగు సత్తిబాబు, చిన్నబ్బాయి, సింహాచలం .పాల్గొన్నారు
హుకుంపేట: ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం మండల నాయకులు టి.అప్పలకొండ పడల్ డిమాండ్ చేశారు. గడీకించుమండ సచివాలయ పరిది సన్యసమ్మపలెం, గడ్డిమర్రి గ్రామ సమస్యలపై సచివాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు అంతులేకుండా పెంచుకుంటూ పోతుందన్నారు.










