Dec 28,2022 23:58

గిరిజన ఆయుధాలతో నిరసన చేపడుతున్న అప్పలనర్స, గంగరాజు, దొన్నుదొర, గిరిజనులు

ప్రజాశక్తి - అనంతగిరి :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణ నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఈ విషయమై ఈ నెల 30న నర్సీపట్నం వస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటన చేయాలని సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ రెగులాపాలెం కూడియ, కొండిభకొట, తమ్ముటు గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ప్రభావిత అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. అనంతరం ఆయన ఆయా గ్రామాల గిరిజనుల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, మూడు వారాల క్రితం సంబందిత అదికారులు ప్రాజెక్టుకు చెందిన సిబ్బందితో కలిసి డ్రోన్‌ లతో సర్వే నిర్వహించారన్నారు. అనంతరం సీపీఎం నేతల బృదం తో ఆయా గ్రామల గిరిజనులు గిరిజన ఆయుధాలు పటుకుని రేగులపాలేం గ్రామం నుండి ప్రోజెక్టు నిర్మాణం చేపటే గెడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్శ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తూ నర్సీపట్నంలో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ లపై గిరిజనులు ఉద్యమం చేయాలన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను కార్పొరేట్‌ సంస్థలైన అదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేయడం తమ రాజకీయ ప్రయోజనాల కోసమేనని మోడీ, జగన్‌ ప్రభుత్వం పై విమర్శించారు. సెల్‌పోన్‌ టవర్‌ ఏర్పాటు చేస్తామని మాయమాటలు గిరిజనులకు చెప్పి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి డ్రోన్‌లతో సర్వే నిర్వహించడం మోసపూరితమన్నారు. వైసిపి నేతలు తమ వ్యక్తిగత రాజకీయ అవసరాలకు అనుగుణంగా గిరిజనులను వాడుకోవడం దారుణమన్నారు. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, పంచాయతీ గ్రామ సభ ఆమోదం, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్పొరేట్‌ సంస్థలకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కేటాయించడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పోలవరం గిరిజన నిర్వాసితులను ఆదుకోలేని ప్రభుత్వాలు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ బాధితులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించారు.
ఉపాధి పేరుతో మాయమాటలు : గంగరాజు
జెడ్పీ టిసి దిసరి. గంగరాజు మాట్లాడుతూ అనంతగిరి మండలంలో 4800 మెగా వాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం పెదకొట, గుజ్జెలి, చిట్టంపాడుతో పాటు చింతపల్లి మండలంలో ఎర్రవరంలో కూడా హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడంతో గిరిజనులను జల సమాధి చేయడమే అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించలేని ప్రభుత్వం హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ బాధితులను ఆదుకుంటాయా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పడం దారుణమన్నారు. పెడకొట లో దొడ్డి దారిన సర్వే నిర్వహించి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివేదికను రూపొందించారన్నారు. గుజ్జిలి, చిట్టెంపాడులో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు నిమిత్తం శాటిలైట్‌ సర్వే నిర్వహించారన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై సర్వే కొచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై జిల్లా పరిషత్‌, ఐటిడిఎ పాలక వర్గం లో ప్రస్తావిస్తాన్నారు.
టిడిపి రాష్ట్ర ఎస్టి సిఎల్‌ నాయకులు దొన్నుదొర మాట్లాడుతూ, గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘించి నరేంద్ర మోడి, జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరూ కలిసి అధాని వంటి కార్పొరేట్‌ సంస్థలకు గిరిజనుల భూములు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.దీనిపై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్‌ కిల్లో మోస్య, సీపీఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు సీవేరి కొండలరావు, పెదకోట మాజీ సర్పంచ్‌ జంపరంగి దేముడు, నారంగి సింహాచలం, జన్ని ఈశ్వరావు, జన్ని. వెంకటరావు, సోమేల దేముడు, సీదరి శంకరరావు, కోనేపు పావని, సివేరి లక్ష్మీ, మాదల ఈశ్వరమ్మ పాల్గొన్నారు.