Nov 09,2022 23:36

  • ఉపాధిని దెబ్బకొట్టిన ఇసుక పాలసీ
  • ప్రభుత్వం తీరుతో సంక్షేమ బోర్డు నిర్వీర్యం
  • నేడు, రేపు ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ మహాసభ
  • నేడు బహిరంగ సభ, ర్యాలీ
  • రేపు ప్రతినిధుల సభ

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు భవన నిర్మాణ కార్మికులకు శాపంగా మారాయి. పెరిగిన ఇసుక, ఇనుము, సిమెంట్‌ ధరలతో నిర్మాణ రంగం మందగించింది. కార్మికుల ఉపాధికి గండిపడింది. కార్మికుల క్లయిమ్‌లు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పూనుకోవడం కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈనేపథ్యంలో గుడివాడలో గురు, శుక్రవారాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 7వ రాష్ట్ర మహాసభ ప్రాధాన్యత సంతరించుకుంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై భవిష్యత్‌ పోరాటాలకు మహాసభ పదును పెట్టనుంది.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరాను నిలిపేసింది. ఎనిమిది నెలల వరకు ఇసుక అందుబాటులోకి రాకపోవడంతో భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఈరంగంలో పనిచేస్తున్న 35 లక్షల కార్మికుల కుటుంబాలపైన తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి కోల్పోయి, కుటుంబాలను పోషించుకోలేక 32 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ వెంటనే కేంద్రం ఆకస్మికంగా కరోనా లాక్‌డౌన్‌ విధించడంతో మూలిగేనక్కపై తాటిపండు పడిన చందగా మారింది. సుదీర్ఘకాలం ఉపాధి లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు అప్పులపాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఇసుక పాలసీ, కేంద్రం విధిస్తున్న జిఎస్‌టి పన్ను విధానాలతో భవన నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్‌, కంకర, ఇనుము ధరలు భారీగా పెరిగాయి. దీంతో నిర్మాణరంగం మందగించింది. ఉపాధి దొరక్క కుటుంబ పోషణకు భవన నిర్మాణ కార్మికులు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో వలసల నివారణకు భవన నిర్మాణరంగానికి ఊతమిచ్చేలా ఉచితంగా ఇసుక అందించి మెటీరియల్‌ ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్‌ డిమాండ్‌ చేస్తోంది.
సంక్షేమ బోర్డు నిర్వీర్యం : క్లయిమ్‌లు నిలిపివేత
కార్మికులను ఆదుకోవడానికి ఏర్పడిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలి అంగవైకల్యానికి గురైనవారు, సహజ మరణం, నిర్మాణ రంగంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలు, పెళ్లిళ్ళు, కాన్పులు అయిన కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన క్లయిమ్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. 22 వేల మందికి సంబంధించి రూ.52 కోట్లు మంజూరైన క్లయిమ్‌ల నిధులను విడుదల చేయడంలేదు. క్లయిమ్‌లకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జివో 17 ద్వారా సంక్షేమ బోర్డు నిధులను ఇతర పథకాలకు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు మళ్లిస్తోంది. ఇతర పథకాలకు, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని, క్లయిమ్‌లను వెంటనే చెల్లించాలని ఫెడరేషన్‌ డిమాండ్‌ చేస్తోంది.
సమస్యలపై పోరాటాలు
ఈ సమస్యల పరిష్కారానికి గత కొన్నేళ్లుగా ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ పోరాటాలను నిర్వహిస్తోంది. జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు, ప్రజాప్రతినిధులకు వినతులు అందించింది. ఈ మహాసభల్లోనూ సమస్యలపై చర్చించి భవిష్యత్‌ పోరాటాలకు రూపకల్పన చేయనున్నారు.
నేడు బహిరంగ సభ, ర్యాలీ
రేపు ప్రతినిధుల సభ
కృష్ణాజిల్లా గుడివాడలో గురు, శుక్రవారాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఏడో రాష్ట్ర మహాసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభలో భాగంగా గురువారం సాయంత్రం 3 గంటలకు గుడివాడలోని ఓరుగంటి వెంకటేశ్వరరావు ప్రాంగణం (కొత్త మున్సిపల్‌ కార్యాలయం)లో బహిరంగ సభ జరుగుతుంది. తొలుత పాత మున్సిపల్‌ కార్యాలయం, రాజబాపయ్య చౌక్‌, నెహ్రౌచౌక్‌, గౌరీశంకర్‌ సినిమాహాల్‌, మార్కెట్‌, బస్టాండ్‌ సెంటర్లు, ఎన్‌టిఆర్‌ స్టేడియం మీదుగా బహిరంగ సభ వేదిక వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ సాగే సెంటర్లను అరుణ తోరణాలు, జెండాలతో అలంకరించారు. మహాసభకు హాజరయ్యే నేతలకు స్వాగత బేనర్లు ఏర్పాటు చేశారు. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.ఉమమహేశ్వరరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్‌, కేరళ బిఒసి సంక్షేమ బోర్డు చైర్మన్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వి.శశికుమార్‌, సిఐటియు జాతీయ కార్యదర్శి ఎం.సాయిబాబు, ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.గోపాలరావు తదితరులు పాల్గొంటారు. శుక్రవారం రైల్వేస్టేషన్‌ రోడ్డులోని జివిఆర్‌ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుంది.
మహాసభను విజయవంతం చేయండి
ఫెడరేషన్‌ కృష్ణాజిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్‌, గోపాలరావు
గుడివాడలో జరిగే ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఏడో మహాసభను విజయవంతం చేయాలని ఫెడరేషన్‌ కృష్ణాజిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజనాల సురేష్‌, కె.వి.గోపాలరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. నిర్మాణరంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈమహాసభలో చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్దేశించుకుంటామని తెలిపారు.