ప్రజాశక్తి-సత్తెనపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గురువారం నుండి 4వ తేదీ వరకూ సిపిఎం చేపట్టే సమరభేరిలో ప్రజానీకమంతా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక పుతుంబాక భవన్ ఆవరణలో సమరభేరి కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు రూ.1200 అయ్యిందని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలైనా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన అధికారంలోకి రాగానే నిత్యవసర వస్తువుల ధరలను తగ్గిస్తానని, విద్యుత్ చార్జీలు పెంచబోనని చెప్పి ఇప్పుడు విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచేశారని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం చేసే ఆందోళనల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంతకాల సేకరణ, సచివాలయాల వద్ద విజ్ఞాపన పత్రాల సమర్పణ, మండల కార్యాలయాల ధర్నాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.శివదుర్గారావు, ఎ.ప్రసాద్‌రావు, పి.సూర్యప్రకాష్‌రావు, ఎ.వెంకట్ నారాయణ, జి.బాలకృష్ణ, ఎస్.వెంకటేశ్వరరావు, కె.సాయి, డి.అమూల్య, జె.రాజకుమార్, గణేష్ పాల్గొన్నారు.










