ప్రజాశక్తి- విఆర్.పురం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యాన సమరభేరి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిపిఎం నాjకులు తెలిపారు. స్థానిక రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో సమరభేరి వాల్ పోస్టర్లను సోమవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఎంపీపీ కారం లక్ష్మి, పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో వలన నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఏజెన్సీ మండలాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం బాటలోనే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నడుస్తోందని, ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, రు.400కే వంట గ్యాస్ ఇవాలని, సంవత్సరానికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని, ధరలు నియంత్రణ నిధి ఏర్పాటు చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు సరఫరా పునరుద్ధరించాలని, ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయాలని, గిరిజన యువతకు స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని తదితర డిమాండ్లతో సిపిఎం ఆధ్వర్యాన సమర భేరి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో సంతకాల సేకరణ, సెప్టెంబర్ 3న సచివాలయాల్లో అర్జీలు, సెప్టెంబర్ 4న మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పోడియం శ్రీరామ్మూర్తి, కారం సుందరయ్య, ఖాదర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.










