Aug 27,2023 21:15

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్‌ కుమార్‌

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాటం
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

     కోటీశ్వరులకు ఊడిగం చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజానీకంతోపాటు వ్యాపార వర్గాలను సైతం సమస్యలతో ముంచెత్తుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే ఆయుధంగా ప్రజలు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్‌ ధనుంజయ మీటింగ్‌ హాల్‌లో సిపిఎం డివిజన్‌ కార్యకర్తల సమావేశం పాములపాడు మండల కార్యదర్శి సామన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మతం పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తుందని విమర్శిం చారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశంలో మహిళలపై హత్యలు, హత్యాచారాలు, నిరుద్యోగం, మత ఘర్షణలు విపరీతంగా పెరిగాయని, ప్రజలపై పన్నుల భారాలు అధికంగా వేసిం దన్నారు. ఏమైనా తగ్గాయా అంటే పంటలకు గిట్టుబాటు ధరలు మాత్రం తగ్గాయని, రైతులు దివాలా తీసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. కేంద్రం ఏం పని చేసినా సమర్థిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతుందని అన్నారు. రాష్ట్రంలో నవ రత్నాలు తప్ప మరో రత్నం వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదని విమర్శించారు. అభివృద్ధి శూన్యంగా ఉందన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతి రేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు, ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రణధీర్‌, మండల కార్యదర్శి నరసింహ నాయక్‌, నాయకులు వెంకటేశ్వరరావు, రామేశ్వర రావు, స్వాములు, రజాక్‌, మాభాష, రామ్‌ నాయక్‌, ఎస్‌ఆర్‌ రమణ, రఫీ, సురేంద్ర, ఇస్మాయిల్‌, మారెన్న, మల్లికార్జున, సుధాకర్‌, బాలయ్య, దాసు, పుల్లమ్మ, అక్కమ్మ, సువర్ణమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.