Aug 19,2023 21:12

సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణమూర్తి

ప్రజాశక్తి - మక్కువ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సిపిఎం సభ్యులు, సానుభూతిపరు లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృష్ణమూర్తి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. జిఎస్‌టి పేరిట ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచిందని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు అప్పజెప్పడా నికి నల్ల చట్టాలను తీసుకొచ్చిం దన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిం చేందుకు చూస్తుందన్నారు. విద్య, వైద్యాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి కుట్రపన్నుతున్నారన్నారు. బిజెపి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం మండల నూతన కమిటీ ఎన్నికైంది. మండల కన్వీనర్‌గా తాడంగి ప్రభాకర్‌, సభ్యులుగా పిట్టల సీతారాం, కొండగొర్రి ఆనంద్‌, అల్లు ఆదినారాయణ, సొండి గౌరమ్మ, దాడి సింహాచలంను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి గంగు నాయుడు, వి.ఇందిర పాల్గొన్నారు.