ప్రజాశక్తి-ఆలూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.రాధాకృష్ణ తెలిపారు. బుధవారం ఆలూరు అంబేద్కర్ సర్కిల్‌లో స్థానిక నాయకులతో కలిసి సిపిఎం సమరభేరి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెంచిన విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరారు. నిరుద్యోగాన్ని నిర్మూలించాలని చేపడుతున్న సమరభేరిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని తెలిపారు. రూ.450 ఉన్న సిలిండర్ ధర నేడు రూ.1200లకు పెరిగిందని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, వాటి ప్రభావం నిత్యావసర వస్తువులపై పడిందని చెప్పారు. కూరగాయల ధరలు కూడా ఊహించనంతగా పెరిగాయని తెలిపారు. కందిపప్పు ధర రూ.80 నుంచి రూ.160కు పెరిగిందని చెప్పారు. వేలాది టన్నుల తిండి గింజలు, పప్పు దినుసులు అక్రమంగా దాచి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ధరలను నియంత్రించకుండా మోడీ భజనలో నిమగమయ్యారని విమర్శించారు. అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని, విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీని గాలికొదిలేసి ఈ నాలుగున్నర ఏళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని తెలిపారు. ఇప్పుడు ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీలు, ఇలా రకరకాల చార్జీలతో ప్రజలపై మరిన్ని భారాలు వేశారని మండిపడ్డారు. ఈ ఒక్క సంవత్సరమే దాదాపు రూ.4 వేల కోట్ల భారం పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సిపిఎం తాలూకా నాయకులు కెపి.నారాయణ స్వామి, మండల నాయకులు ఈరన్న, తిమ్మప్ప, మైనా, అబ్దుల్లా, పరమేష్ గౌడ్ పాల్గొన్నారు. హాలహర్విలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం మండల కార్యదర్శి ఎం.కృష్ణ ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు రాధాకృష్ణ హాజరయ్యారు. ఎమ్మిగనూరు సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు, జిల్లా నాయకులు గోవిందు, జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు గోడపత్రికలను ఆవిష్కరించారు. సిపిఎం పట్టణ నాయకులు లక్ష్మీ నరసయ్య, అబ్దుల్లా, రాముడు, కృష్ణ, లక్ష్మన్న, రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప పాల్గొన్నారు. ఆస్పరి మండలంలోని చిగిలి, బినిగేరి, నగరూరు గ్రామాల్లో కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు, నాయకులు ఇబ్రహీం, ఈరన్న, ప్రకాష్, బద్రి, తిప్పన్న, షాషావలీ, అల్లాబకాష్ తెలిపారు.










