Oct 19,2023 21:56

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
        కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆయిల్‌ పామ్‌ గెలల ధర తగ్గించడంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను ఆయిల్‌ పామ్‌ గెలలకు రూ.18 వేలు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా, రైతాంగ సమస్యలపై తీర్మానాలు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ విదేశీ క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి సుంకం కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేయడం వల్ల దేశీయంగా ఆయిల్‌ పామ్‌ గెలల ధరలు తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆగస్టులో రూ.12,900 ఉన్న గెలల ధర సెప్టెంబరులో రూ.12,122కు తగ్గించడం అన్యాయమన్నారు. గతేడాది టన్ను గెలలకు రూ.23 వేలు ఉంటే సగానికి ధర తగ్గిపోయిందన్నారు. విదేశీ వంట నూనెల దిగుమతితో ఆయిల్‌ పామ్‌ రైతులను దెబ్బతీయడం తగదన్నారు. టన్ను గెలలకు రూ.18 వేలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు వ్యవసాయానికి కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయన్నారు. పట్టిసీమ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వరి పొట్ట దశలో సాగునీరు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. సాగునీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల నిరాహార దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరారు. 2004లో పెన్షన్‌ విధానం రద్దు చేసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్రంలో నాలుగైదేళ్లుగా ఉద్యమం సమరశీలంగా నడుస్తుందని ఈ పోరాటానికి సిపిఎం మద్దతు నిత్యం ఉంటుందన్నారు. సిపిఎస్‌ను రద్దు చేస్తానని గత ఎన్నికల్లో సిఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రజల సమస్యలపై ఈ నెల 30 నుండి సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు యాత్రల్లో భాగంగా వచ్చేనెల ఆరో తేదీ సాయంత్రం మన జిల్లాలోని కుక్కునూరులో ప్రవేశించే బస్సు యాత్ర ఏడు, ఎనిమిది తేదీల్లో పోలవరం నియోజకవర్గ మండలాల్లో సాగుతూ హనుమాన్‌జంక్షన్‌ చేరుకుంటుందన్నారు. ఈ ప్రజారక్షణ భేరి యాత్రను, వచ్చేనెల 15న విజయవాడలో జరిగే బహిరంగసభను జయప్రదం చేసేందుకు జిల్లాలోని పార్టీ శ్రేణులు కదలాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్‌, పి.కిషోర్‌, ఎం.నాగమణి, జి.రాజు, జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, వై.నాగేంద్రరావు, ఎం.జీవరత్నం, జి.వెంకట్రావు, పి.రామకృష్ణ, కె.శ్రీనివాస్‌ మాట్లాడారు.