Oct 30,2023 01:25

మాట్లాడుతున్న నేతాజి

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులలో కేంద్ర కార్మిక కర్షక సంఘాలు పిలుపులో భాగంగా 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాపడావో (మహాధర్నా)ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పాత గుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన సిఐటియు జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. నేతాజి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక వర్గంపై ముప్పేట దాడి చేస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తీసుకురావడం, పని గంటల పెంపు, కార్పొరేట్‌ వర్గానికి పెద్ద ఎత్తున రాయితీలు వంటి వాటిని అమలు చేస్తూ ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. ఈ విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలన్నారు. ఈ కాలంలో ఏ ఒక్క పరిశ్రమను స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలు మొత్తం అదాని, అంబానీలకు కట్టబెడుతోందన్నారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలు తెచ్చి రైతులపై దాడి చేసిందన్నారు. రైతుల పోరాడి ఆ చట్టాలను తిప్పికొట్టారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెంచి భారాల మోపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగే మహాధర్నాలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, టి.వి.జి.రవిశంకర్‌, ఎస్‌.కె.హుస్సేన్‌వలి, జిల్లా కార్యదర్శి ఎన్‌.శివాజీ, బి.ముత్యాలరావు, బి.లక్ష్మణరావు, ఎన్‌.రమేష్‌ పాల్గొన్నారు.