ప్రజాశక్తి -తగరపువలస : కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యాన క్షేత్ర స్థాయి ప్రచారం, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు. బిజెపి మతోన్మాద విధానాలు ఫెడరలిజానికి, సెక్యులరిజానికి పెను ముప్పుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు వంటి ప్రధాన సమస్యలపై ఏప్రిల్ 14 నుంచి 30వ తేదీ వరకు ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. తగరపువలసలో ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని, స్థానిక జంక్షన్ మీదుగా ఆర్టీసి బస్సులు నడపాలని, రైతు బజారు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అల్లు బాబూరావు, కానూరి రాంబాబు, నూలు ఆదినారాయణ, ఎం.అప్పలరాజు, ఎం.సన్యాసిరావు, అల్లం గోవిందరావు, ఎం.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
చండ్ర రాజేశ్వరరావు వర్థంతి
స్వాతంత్య్ర సమర యోధులు, వీర తెలంగాణ పోరాటంలో అగ్ర భాగాన నిలబడి విజయవంతం చేసిన చండ్ర రాజేశ్వరరావు అందించిన సేవలు, త్యాగం మరువలేనిదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు అన్నారు. చండ్ర రాజేశ్వరరావు వర్థంతిని సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.










