Nov 16,2022 00:04

జెండా ఆవిష్కరణ చేసి నినాదాలుచేస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు అన్నారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా మంగళవారం తిమ్మరాజుపేట గ్రామంలో రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోయిన మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డిసెంబర్‌ నెలలో కేరళలో ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ మహాసభ జరుగుతుందని, దీనికి మద్దతుకు దేశంలోని లక్ష గ్రామాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. మహాసభ సందర్భంగా ఈనెల 16న అనకాపల్లి దొడ్డి రామునాయుడు భవనంలోనూ, 23న విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలోనూ వ్యవసాయ రంగం-సహకార సంఘాల పాత్ర అన్న అంశంపై సెమినార్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సెమినార్‌లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు, రాష్ట్ర రైతు నాయకులు పాల్గొంటారని, రైతాంగం అధిక సంఖ్యలో హాజరై వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు సరగడం రామునాకయుడు, కర్రి నాగేశ్వరరావు, కర్రి రాము, బి.వెంకటరమణ, భాస్కరరావు, పెంటకోట వీరునాయుడు పాల్గొన్నారు.
ఎఐకెఎస్‌ జెండా ఆవిష్కరణ
కె.కోటపాడు : గిరిజనోద్యమ నేత బిర్సా ముండా జయంతి వేడుకలతో పాటు అఖిలభారత కిసాన్‌ సభ 35వ మహాసభ సందర్భంగా మండలంలోని వి.సంతపాలెం, సూరెడ్డిపాలెం గ్రామాల్లో మంగళవారం ఎఐకెఎస్‌ జెండాలను ఎపి రైతు సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కోశాధికారి గండి నాయినబాబు మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు కొనసాగించాలని, రైతు ఆత్మహత్యలు నిరోధించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రొంగలి ముత్యాల నాయుడు, నాయకులు ఎర్ర దేవుడు, ఆదినారాయణ, సూరెడ్డి అప్పలనాయుడు, బోను శ్రీరామ్మూర్తి, లెక్కల రాము పాల్గొన్నారు.