ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వ పధకాలు సక్రమంగా అమలు చేయడానికి , పర్యవేక్షించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (ణ×ూనA) ఏర్పాటు చేసినట్లు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో అయోధ్య రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, నేషనల్ హైవేస్, నాగరవాటికల ఏర్పాటు, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, 15 వ ఆర్దిక సంఘం నిధులు, సంసాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖపై సమీక్షించారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ దిశా కమిటీలు 76 కేంద్ర పథకాలు, కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం ద్వారా జిల్లాలను అన్ని స్థాయిలలో అగ్రపధంలో నిలపడానికి కృషి చేసేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం అవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అందరూ కృషి చేయాలన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద ఉపాధి హామీ ద్వారా నర్సరీలు ఏర్పాటు చేయాలని, అమృత్ సరోవర్ పథకం కింద చెరువులు బాగుచేసి ప్లాంటేషన్ పనులు చేపట్టాలన్నారు. తెనాలి పట్టణంలో నగరవాటిక నిర్మాణానికి 9.8 ఎకరాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన క్రింద జిల్లాలో 2020-21లో రూ.3152 లక్షలతో 44.88 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టగా, అందులో నాలుగు రోడ్ల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన మూడు రోడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. 2022-24 ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన క్రింద 23.576 కిలోమీటర్ల మేర రూ.2046.22 లక్షలలో చేపట్టనున్న నాలుగు రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అనుమతులు మంజూరయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిపాలన అనుమతులు అందాక టెండర్లు పిలుస్తామని పంచాయతీరాజ్ ఎస్‌ఇ బ్రహ్మయ్య తెలిపారు. సమావే శంలో జెడ్పీ సిఈఓ జె.మోహన్‌రావు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, వెంకట నారాయణ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎంపి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి