Aug 29,2023 22:06

కురుపాంలో సంతకాలు సేకరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు

ప్రజాశక్తి-కురుపాం  :   కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మంగళవారం మండల కేంద్రంలో గల రావాడ జంక్షన్‌ వద్ద సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు హాజరయ్యి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ మతోన్మాద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కోసమే సిపిఎం సమరభేరి మోగిస్తుందని, దానిలో భాగంగా సంతకాలు సేకరణ సెప్టెంబర్‌ 1న గ్రామ సచివాలయాల్లో ధర్నా వినతుల సమర్పణ, సెప్టెంబర్‌ 3న నిరుద్యోగ వ్యతిరేక దినం, సెప్టెంబర్‌ 4న మండల కార్యాలయంలో వద్ద ధర్నా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.సింహాచలం, గిరిజన యువత, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
కొమరాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు తలపెట్టిన సమరభేరిని జయప్రదం చేయాలని మంగళవారం స్థానిక జూనియర్‌ కాలేజీ కూడలిలో గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, నాయకులు ఉపేంద్ర, శివుని నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తలపెట్టిన ప్రచార భేరిలో భాగంగా సెప్టెంబర్‌ 1న సచివాలయాల వద్ద, 4న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు.
పాలకొండ రూరల్‌: కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈనెల 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు జరిగే సిపిఎం సమరభేరిలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు దూసి దుర్గారావు పిలుపునిచ్చారు. మండలంలోని వెలగవాడలో సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కె. సింహాచలం, బి. అంకమ్మ, కె. రాము, డి. జగన్నాథం, కె.మగతయ్య, ఎస్‌. శంకర్రావు, ఎస్‌. రాములు తదితరులు పాల్గొన్నారు.
భామిని : .కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వలా ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు తలపెట్టిన సమరభేరిని జయప్రదం చేయాలని సిపిఎం మండల కన్వీనర్‌ జి.జగన్నాయుకులు, కె.మిన్నారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని ఘనసర అంబేద్కర్‌ విగ్రహం వద్ద సమర భేరి పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తలపెట్టిన ప్రచార భేరిలో భాగంగా సెప్టెంబర్‌ 1న సచివాలయాల వద్ద, 4న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జి.అప్పారావు ఉన్నారు.